టెహ్రాన్: హార్మూజ్ జలసంధి మీదుగా నౌకలను సురక్షితంగా వెళ్లనిస్తున్నామని ఇరాన్ మరోసారి తెలిపింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ‘హార్మూజ్ జలసంధి తెరిచే ఉంది. ఇరాన్‌తో ఆయా దేశాలు సంప్రదిస్తే సరిపోతుంది. మేము ఈ జలసంధిని మూసివేయలేదు. మా శత్రువుల నౌకలను మాత్రమే వెళ్లనివ్వడం లేదు. ఇతర దేశాల నౌకలు ఈ జలసంధి ద్వారా వెళ్లవచ్చు. సంప్రదింపులు జరిపితే వారి నౌకలను సురక్షితంగా వెళ్లనిస్తాం’ అని అబ్బాస్ అరాఘ్చీ తెలిపారు.
కాగా, నాటో మిత్రదేశాలు, ఆసియా పసిఫిక్ ప్రాంత దేశాలు ఈ యుద్ధంలో చేరాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరుతున్నారు. శుక్రవారం ఆయన ట్రూత్ సోషల్‌లో ఈ మేరకు ఓ పోస్టు చేశారు.
నాటో సభ్యదేశాలను పేపర్ టైగర్స్ అని పిలిచారు, అలాగే చమురు ధరలు పెరుగుతుండడం ఆయా దేశాలకు నచ్చడం లేదని విమర్శించారు. అయినప్పటికీ, హార్మూజ్ జలసంధిని తెరవడానికి ఏర్పాటు చేద్దామనుకుంటున్న కూటమిలో చేరడానికి ఆ దేశాలు ఆసక్తి చూపడం లేదని అన్నారు. ట్రంప్ దాదాపు ఏడు రోజుల క్రితం పలు దేశాల మద్దతు కోరారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో ఏడు దేశాల పేర్లను పేర్కొన్నారు. అప్పటి నుంచి ఒత్తిడి పెంచుతున్నారు.
బాగ్దాద్‌లో డ్రోన్ దాడి
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని మంసూర్ ప్రాంతంపై డ్రోన్ దాడి జరిగింది, ఆ డ్రోన్లలో ఒకటి ఇరాక్ గూఢచారి భవనాన్ని లక్ష్యంగా చేసుకుందని ఇరాక్ తెలిపింది. ఆ భవనంలో ఇరాక్ భద్రతా సంస్థ పని చేస్తోందని చెప్పింది. అది ఇరాక్‌లో అమెరికా సలహాదారులతో కలిసి పని చేస్తోందని వివరించింది.


