యుద్ధంలో ట్విస్ట్‌.. ట్రంప్‌నకు ఇరాన్‌ మరో ఝలక్‌! | Iran Rejects US Proposal For 48-Hour Ceasefire As Tensions Escalate | Sakshi
Sakshi News home page

యుద్ధంలో ట్విస్ట్‌.. ట్రంప్‌నకు ఇరాన్‌ మరో ఝలక్‌!

Apr 4 2026 8:58 AM | Updated on Apr 4 2026 9:31 AM

Iran Rejects US Proposal For 48-Hour Ceasefire As Tensions Escalate

ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పీక్‌ స్టేజ్‌కు చేరుకున్నాయి. దాడులు, ప్రతి దాడుల నేపథ్యంలో అమెరికాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రతిపాదించిన 48 గంటల కాల్పుల విరమణను ఇరాన్ స్పష్టంగా తిరస్కరించింది. మధ్యవర్తి దేశం పాకిస్థాన్​ ద్వారా ఈ ప్రతిపాదన పంపినప్పటికీ, టెహ్రాన్ తన కఠిన వైఖరిని కొనసాగిస్తూ ఆ ఆఫర్‌ను అంగీకరించలేదు. దీంతో, యుద్ధం మరింత భీకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాగా.. ఇరాన్ రక్షణ వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను కూడా ఇరాన్ ఖండించింది. తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేశామన్న అమెరికా వాదనలను తప్పుబట్టింది. కొత్త ఆధునిక రక్షణ వ్యవస్థలతోనే అమెరికా విమానాలను కూల్చివేశామని ఇరాన్ సైన్యం పేర్కొంది. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన A-10 యుద్ధ విమానాన్ని ఇరాన్‌ కూల్చివేసినట్లు ప్రకటించింది. ఇదే సమయంలో, మరో అమెరికా యుద్ధ విమానం కూలిపోయినట్లు వార్తలు రావడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. అలాగే, ఒక F-15E స్ట్రైక్ ఈగుల్ విమానం కూలిన ఘటనలో ఒక సిబ్బందిని రక్షించగా, మరో వ్యక్తి గల్లంతైనట్లు సమాచారం. హార్మూజ్‌ జలసంధి సమీపంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపింది. మొత్తంగా, ఇరాన్-అమెరికా మధ్య పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది.

మరోవైపు.. అంతర్జాతీయ అణుశక్తి సంస్థపై(IAEA) ఇరాన్ అణు శక్తి సంస్థ తీవ్ర ఆరోపణలు చేసింది. తమ అణు కేంద్రాలపై జరిగిన దాడులను ఐఏఈఏ ఖండించకపోవడంపై ఇరాన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. అణు శక్తి కేంద్రాలు శాంతియుత ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నవని, వాటిపై దాడులను ఖండించాలని ఆయన కోరారు. ఈ విషయంలో ఐఏఈఏ మౌనం పాటించడం అంతర్జాతీయ సమాజంలో నమ్మకాన్ని దెబ్బతీస్తోందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, దాడులు చేసిన దేశాలకు మద్దతు ఇచ్చినట్టే అని ఘాటు విమర్శలు చేసింది. ముఖ్యంగా IAEA పర్యవేక్షణలో ఉన్న కేంద్రాలపైనే దాడులు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలిపింది.

కాగా, మార్చి 27న ఖొండాబ్ హెవీ వాటర్ ప్లాంట్‌పై జరిగిన దాడిలో ఆ కేంద్రం తీవ్రంగా దెబ్బతిన్నట్లు IAEA ధ్రువీకరించింది. ప్రస్తుతం ఆ ప్లాంట్ పనిచేయలేని స్థితిలో ఉందని వెల్లడించింది. ఇదే రోజు ఆర్దకాన్ ప్రాంతంలోని యెల్లోకేక్ ఉత్పత్తి కేంద్రం కూడా దాడికి గురైంది. ఈ తరహా దాడులు రేడియోధార్మిక లీకేజీకి దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అణు కేంద్రాలపై దాడులు కొనసాగితే, ప్రాంతీయంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ, మానవీయ విపత్తు సంభవించే అవకాశముందని హెచ్చరిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement