అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు | Iran launched counter attacks on US bases in Jordan and Bahrain | Sakshi
Sakshi News home page

అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు

Sep 2 2026 3:39 AM | Updated on Sep 2 2026 3:40 AM

Iran launched counter attacks on US bases in Jordan and Bahrain

source: X

మిడిల్ ఈస్ట్‌లో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్‌లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) స్థావరాలపై అమెరికా తాజా దాడుల తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది.

ఇరాన్ మంగళవారం రాత్రి జోర్డాన్, బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. జోర్డాన్‌లో సైరన్లు మోగగా, ఆ దేశ గగనతలంలోకి ప్రవేశించిన 13 ఇరాన్ క్షిపణుల్లో పదింటిని వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. మిగిలిన మూడు క్షిపణులు జనావాసాలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో పడినట్లు జోర్డాన్ సాయుధ దళాలు వెల్లడించాయి.

జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై జరిగిన దాడుల్లో అమెరికా సైనికులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే ఇరాన్‌కు చెందిన IRGC మాత్రం జోర్డాన్‌లోని క్యాంప్ టిటిన్‌పై దాడి చేసి భారీ సంఖ్యలో అమెరికా సైనికులను హతమార్చినట్లు ప్రకటించింది.

మరోవైపు బహ్రెయిన్‌లోని షేక్ ఇసా ఎయిర్ బేస్ వద్ద అమెరికా సైనికులు, రాడార్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని కామికేజ్ డ్రోన్లతో భారీ దాడి చేసినట్లు IRGC ప్రకటించింది. అయితే ఈ దాడిపై బహ్రెయిన్ లేదా అమెరికా నుంచి అధికారిక ధృవీకరణ రాలేదు.

బహ్రెయిన్, కువైట్‌కు హెచ్చరికలు
అమెరికా దాడులు ప్రారంభమైన కొద్దిసేపటికే ఇరాన్ సైనిక ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫఘారి తీవ్ర హెచ్చరికలు చేశారు. బహ్రెయిన్, కువైట్ విషయంలో ఇకపై ఇరాన్ సంయమనం పాటించబోదని తెలిపారు. “బహుమతులు దారిలో ఉన్నాయి” అంటూ హెచ్చరించారు.

అమెరికా దాడులకు ఇదే కారణం
ఇరాన్‌పై తాజా దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. హర్మూజ్ జలసంధిలో సముద్రపు మైన్లు అమర్చేందుకు ఇరాన్ ప్రయత్నించడం, అమెరికా సైనిక స్థావరంపై ఎనిమిది క్షిపణులు ప్రయోగించడం తమ దాడులకు కారణమని ట్రంప్ తెలిపారు.

చదవండి: ఇరాన్‌పై మళ్లీ దాడులు మొదలుపెట్టిన అమెరికా

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement