కువైట్ విమానాశ్రయంపైకి ఇరాన్ డ్రోన్లు
చమురు ట్యాంక్ పేలి భారీగా మంటలు
ఖతర్‌లో చమురు నౌకపైనా దాడులు
యూఏఈలో భారతీయునికి గాయాలు
ఇరాన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం
టెహ్రాన్‌లో ఫెంటానిల్ ఫ్యాక్టరీపై దాడి
దుబాయ్/వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ నడుమ యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతూనే ఉంది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ బుధవారం దాడులకు దిగింది. అక్కడి ఇంధన నిల్వ ట్యాంకులనే లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు ప్రయోగించింది. ఒక ట్యాంక్ పేలిపోయి విమానాశ్రయంలో భారీగా మంటలు చెలరేగినట్టు కువైట్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
ఖతర్ తీర సమీపంలో ఆ దేశానికి చెందిన ఓ చమురు నౌకపై కూడా ఇరాన్ క్రూయిజ్ క్షిపణితో దాడి చేసింది. దాంతో అందులోని 21 మంది సిబ్బందిని హుటాహుటిన ఖాళీ చేయించారు. యూఏఈలోని ఫుజైరాలో డ్రోన్ శకలాలు తాకి ఒక వ్యక్తి మరణించాడు. బహ్రెయిన్‌పై కూడా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగింది. పలు క్షిపణులు, డ్రోన్లను నేలకూల్చినట్టు జోర్డాన్, సౌదీ అరేబియా ప్రకటించాయి.
యూఏఈలోని ఉమ్ అల్ థౌబ్ పారిశ్రామిక ప్రాంతంపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఒక భారతీయుడు గాయపడ్డాడు. బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తి మరణించాడు. తన ప్రధాన శత్రువైన ఇజ్రాయెల్‌పై కూడా ఇరాన్ భారీ స్థాయిలో విరుచుకుపడింది. దేశవ్యాప్తంగా పలు నగరాలపై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. దాంతో ఎక్కడ చూసినా సైరన్ల మోత విన్పించింది. ఐదుగురికి పైగా గాయపడ్డట్టు సమాచారం.
హూతీ రెబెల్స్ కూడా ఇజ్రాయెల్‌పైకి క్షిపణులు ప్రయోగించారు! ఉత్తర ఇరాక్‌లోని ఇబ్రిల్‌లో బ్రిటన్ ఇంధన సంస్థ బీపీకి చెందిన నిల్వ కేంద్రంపై డ్రోన్ దాడులు జరిగాయి. దాంతో అక్కడ మంటలు చెలరేగినట్టు సమాచారం. ఇరాన్‌కు దన్నుగా యుద్ధ రంగంలోకి దిగేందుకు సిద్ధమని రష్యా అనుకూల చెచెన్ ఫైటర్లు ప్రకటించారు! పోరును మరింత ఉధృతం చేసేందుకు ఇజ్రాయెల్ వ్యతిరేక శక్తుల మద్దతు కూడా కూడగడతామని ఇరాన్ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు చైనా, పాకిస్తాన్ ఐదు సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించాయి.
దద్దరిల్లిన టెహ్రాన్
అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో దాడులకు దిగాయి. రాజధాని టెహ్రాన్ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. ఒకప్పటి అమెరికా రాయబార కార్యాలయ భవన ప్రాంగణం భారీగా దెబ్బ తింది. టెహ్రాన్‌లో ఫెంటానిల్ ఉత్పత్తి చేస్తున్న టోఫిక్ దారు కర్మాగారాన్ని బాంబులతో నేలమట్టం చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. దాన్ని రసాయినిక ఆయుధాల తయారీకి ఇరాన్ వాడుతోందని ఆరోపించింది. లెబనాన్‌పై కూడా ఇజ్రాయెల్ దాడుల తీవ్రత కొనసాగింది. రాజధాని బీరూట్‌పై జరిగిన దాడులకు ఐదుగురు బలైనట్టు ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాల నుంచి తమ సైన్యం వెనక్కు తగ్గుతున్నట్టు తెలిపింది. లెబనాన్‌లో హెజ్బొల్లా కార్యాలయాలను లక్ష్యం చేసుకుంటామని ఇజ్రాయెల్ పేర్కొంది.
ప్రభుత్వంపై ఐఆర్‌జీసీ పట్టు!
ఇరాన్ పూర్తిగా సాయుధ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్‌జీసీ) విభాగం చెప్పుచేతల్లోకి వెళ్లిన ట్టు వార్తలొస్తున్నాయి. అధ్యక్షుడి నిర్ణయాలు, నియామకాలను పక్కన పెట్టి ప్రభుత్వంపై ఐఆర్‌జీసీయే పూర్తిస్థాయిలో పెత్తనం చేస్తోందని ఇరాన్ ఇంటర్నేషనల్ వార్తా సంస్థ పేర్కొంది.


