హార్మూజ్ జలసంధి సమీపంలో ఘటన
‘అరాశ్–ఇ–కమాంగీర్’తో పని పూర్తిచేశామన్న ఇరాన్
టెహ్రాన్/దుబాయ్: ఇరాన్‌పై యుద్ధంలో అమెరికా భారీగా నష్టపోతోంది. ఇరాన్ సైన్యం దాడుల్లో అత్యంత విలువైన యుద్ధ విమానాలు, డ్రోన్లు నేలమట్టమవుతున్నాయి. అమెరికాకు చెందిన ఎంక్యూ–9 రీపర్ డ్రోన్‌ను ధ్వంసం చేశామని ఇరాన్ ప్రకటించింది. ఇటీవలే హార్మూజ్ జలసంధి సమీపంలో ఖేష్మ్ దీవి వద్ద ఈ దాడికి పాల్పడినట్లు తెలిపింది. ఇందుకోసం కొత్తగా అభివృద్ధి చేసిన గగనతల రక్షణ వ్యవస్థ ‘అరాశ్–ఇ–కమాంగీర్’ను ఉపయోగించినట్లు పేర్కొంది.
ఎంక్యూ–9 రీపర్ డ్రోన్ విలువ 30 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఇరాన్ సైనిక సామర్థ్యం ఇంకా తగ్గిపోలేదని చెప్పడానికి ఎంక్యూ–9 రీపర్ డ్రోన్ కూల్చివేత ఒక ఉదాహరణ అని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలను ఇకపైనా సవాలు చేసే స్థితిలో ఇరాన్ ఉందని అంటున్నారు. ఇరాన్ సైన్యం స్థానికంగానే నూతన గగనతల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ అమెరికా, ఇరాన్‌ల మధ్య మళ్లీ దాడులు, ప్రతిదాడులు మొదలయ్యాయి. ఆత్మరక్షణ కోసమే దాడులు చేయాల్సి వస్తోందని అమెరికా చెబుతోంది. ఇరాన్ సైతం ప్రతీకార దాడులకు దిగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా డ్రోన్‌ను హార్మూజ్ జలసంధి సమీపంలో కూల్చివేయడం చూస్తే పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అరాశ్ ద ఆర్చర్
అరాశ్–ఇ–కమాంగీర్ అనేది ఇరాన్ గగనతలం, సముద్ర సరిహద్దుల సమీపంలో ఉన్న శత్రు గూఢచార డ్రోన్లను అడ్డగించగల, కూల్చివేయగల ఒక స్టెల్త్–డిటెక్షన్ వ్యవస్థ. అరాశ్–ఇ–కమాంగిర్ అనే పేరుకు ఒక ప్రత్యేకత ఉంది. పర్షియన్ పురాణాల్లోని ‘అరాశ్ ద ఆర్చర్’ ఒక మహాయోధుడు. విదేశీ దండయాత్రల నుంచి ఇరాన్‌ను రక్షించినందుకు చాలా ప్రసిద్ధి చెందాడు. ఇరాన్ జానపద కథల ప్రకారం చూస్తే.. అరాశ్ తన ప్రాణాలను పణంగా పెట్టి విసిరిన బాణం ద్వారా ఇరాన్, మధ్య ఆసియా మధ్య సరిహద్దు ఏర్పడింది.
పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్ తన సైనిక సామర్థ్యం పెంచుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. స్థిర రాడార్ వ్యవస్థలపై ఆధారపడకుండా.. శత్రుదేశాల డ్రోన్లు, విమానాలను లక్ష్యంగా చేసుకునేలా తక్కువ ఖర్చుతో కూడిన గగనతల రక్షణ వ్యవస్థల తయారీలో పెట్టుబడులను క్రమంగా పెంచుతోంది. వివిధ రకాల క్షిపణుల రూపకల్పనలో ఇరాన్ చాలావరకు స్వయం సమృద్ధి సాధించింది. చౌకైన, సరళమైన ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది. ఇవి ఖరీదైన అమెరికా యుద్ధవిమానాలను, డ్రోన్లను సులువుగా దెబ్బతీస్తున్నాయి.
ఫైటర్ జెట్‌నూ కూల్చేశాం
అమెరికాకు చెందిన ఒక యుద్ధ విమానాన్ని ఇరాన్ సైన్యం కూల్చివేసినట్లు ఇరాన్ అధికారిక మీడియా సంస్థ ప్రకటించింది. శుక్రవారం ఉదయం బషెహర్ ప్రావిన్స్‌లోని జామ్ గవర్నరేట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పేర్కొంది. అమెరికా ఫైటర్ జెట్‌ను ఇరాన్ సేనలు నేలమట్టం చేసినట్లు స్థానిక గవర్నర్ మసూద్ టాంగెస్తానీ చెప్పారని వెల్లడించింది. ఈ దాడిలో ప్రాణనష్టం జరిగిందా? అనేది ఇంకా తెలియరాలేదు. యుద్ధ విమానం మంటల్లో చిక్కుకొని కూలిపోతున్న ఓ ఫొటోను ఇరాన్ సైన్యం ‘ఎక్స్’లో షేర్ చేసింది. అయితే, అమెరికా ఫైటర్ జెట్‌ను కూల్చేశామంటూ ఇరాన్ చేసి ప్రకటనను అమెరికా సైన్యం ఖండించింది. అలాంటి దాడి ఏదీ జరగలేదని తేల్చిచెప్పింది. ‘మేము ఒక్క యుద్ధ విమానం కూడా నష్టపోలేదు’ అని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది.


