
సనా: యెమెన్‌లో మరణశిక్ష విధించిన భారతీయ నర్సు నిమిషా ప్రియకు జూలై 16న ఉరిశిక్ష అమలు చేయనున్నారు. దేశ ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించడం, సాయుధ దళాలను బలహీనపరిచే చర్యకు పాల్పడటంతో పాటు హత్య వంటి అనేక నేరాలకు యెమెన్ చట్టం మరణశిక్ష విధిస్తుంది. నిమిషా ప్రియ దేశం నుండి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఆమెను అరెస్టు చేశారు. 2018లో ఆమె హత్యకు పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది.
యెమెన్ జాతీయుడి హత్యకు పాల్పడిన కేరళకు చెందిన నిమిషా ప్రియ మరణశిక్షకు గత ఏడాది యెమెన్ అధ్యక్షుడు ఆమోదం తెలిపారు. ఈ కేసులోని పరిణామాలను పరిశీలిస్తున్న భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆమె కుటుంబ సభ్యులను సంప్రదించింది. ఆమెకు సాధ్యమైన సహాయాన్ని అందిస్తున్నామని తెలిపింది. నిమిషా ప్రియ తన తల్లిదండ్రుల పోషణా భారాన్ని భరించేందుకు 2008లో యెమెన్‌కు వెళ్లింది. పలు ఆస్పత్రులలో పనిచేసిన ఆమె.. ఆ తరువాతి కాలంలో సొంత క్లినిక్‌ను ప్రారంభించింది. 2014లో తలాల్ అబ్దో మహదీ అనే స్థానికునితో కలసి క్లినిక్‌ను కొనసాగించింది.
Indian nurse Nimisha Priya to be executed in Yemen on July 16, claims report.
Here’s what her family says: https://t.co/sGOIuq3eHEhttps://t.co/sGOIuq3eHE— WION (@WIONews) July 9, 2025
అయితే ఆ తరువాత నిమిషా ప్రియకు మహదీతో విభేదాలు తలెత్తాయి. దీంతో ఆమె అతనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. 2016లో అధికారులు అతనిని అరెస్టు చేశారు. తరువాత అతను జైలు నుండి విడుదలయ్యాడు. అప్పటి నుంచి ఆమెను బెదిరిస్తూ రాసాగాడు. అలాగే ఆమె పాస్‌పోర్టును తీసుకున్నాడు. ఈ నేపధ్యంలో నిమిషా ప్రియ తన పాస్‌పోర్ట్‌ను తిరిగి దక్కించుకునేందుకు మహదీకి మత్తుమందు ఇచ్చిందనే ఆరోపణలు వచ్చాయి. అయితే అది అధిక మోతాదు కావడంతో, మహదీ మృతిచెందాడు. వెంటనే నిమిషా ప్రియ దేశం విడిచి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా, ఆమెను అధికారులు అరెస్టు చేశారు. 2018లో యెమెన్ జాతీయుడిని హత్యచేసినందుకు ట్రయల్ కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించింది. ఈ నిర్ణయాన్ని 2023 నవంబర్‌లో దేశ సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ సమర్థించింది.