
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై అదనపు సుంకాలు విధించడంతో ఆ దేశంతో భారత్ వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయని, అందుకే భారత్.. అమెరికాతో వాణిజ్య చర్చల నుండి వెనక్కు తగ్గిందని మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ గార్గ్ వ్యాఖ్యానించారు.
ఎన్‌డీటీవీతో సుభాష్ గార్గ్ మాట్లాడుతూ ట్రంప్ ఏకపక్ష సుంకాలు 50 శాతం వరకు ఉండటంతో న్యూఢిల్లీ ఇప్పటికే చర్చల నుండి సమర్థవంతంగా వైదొలిగిందన్నారు. భారత్ ముడి చమురును రష్యా నుంచి కొనుగోలు చేస్తూ, భారీగా లాభాలు పొందుతోందంటూ ట్రంప్ పదేపదే చేసిన వాదనలను సుభాష్ గార్గ్ తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణ ఆర్థిక వాస్తవికత కాదని, ఇదొక రాజకీయ నాటకమని ఆయన పేర్కొన్నారు. రష్యా ముడి చమురు కొనుగోలు వలన భారత వాస్తవ పొదుపు సంవత్సరానికి 25 బిలియన్ అమెరికన్ డాలర్లు కాదని, 2.5 బిలియన్ అమెరికా డాలర్లకు దగ్గరగా ఉందని గార్గ్ అన్నారు.
ఈ విధంగా తప్పుడు సంఖ్యను చెప్పవచ్చుగానీ, ట్రంప్ దీనిని భారతదేశాన్ని శిక్షించడానికి కత్తిగా ఉపయోగిస్తున్నారని గార్గ్ ఆరోపించారు. గార్గ్ తెలిపిన వివరాల ప్రకారం షిప్పింగ్, భీమా, బ్లెండింగ్ ఖర్చులను పరిగణనలోకి తీసుకున్నాక భారత్.. రష్యన్ బారెల్స్ నుంచి అందుతున్న డిస్కౌంట్ బ్యారెల్‌కు కేవలం మూడు నుంచి నాలుగు అమెరికన్ డాలర్లు మాత్రమేనని అన్నారు. భారత్ చమురు కొనుగోలు విషయంలో అంతర్జాతీయ ఒప్పందాన్ని ఉల్లంఘించడం లేదని గార్గ్ స్పష్టం చేశారు.
అమెరికా విధిస్తున్న సుంకాల స్థాయిలలో ఎవరూ వ్యాపారం చేయలేదని, అమెరికా ఒత్తిడిని ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని, ప్రధాని మోదీ దేశంలోని రైతుల ప్రయోజనాల కోసం ఎప్పుడూ రాజీ పడనని ప్రతిజ్ఞ చేశారని గార్గ్ పేర్కొన్నారు. ట్రంప్ సుంకాలకు ప్రతీకారంగా అమెరికా వస్తువులను బహిష్కరించాలని వస్తున్న పిలుపులపై గార్గ్ మాట్లాడుతూ అది పిచ్చితనమని, అమెరికా- భారత్‌లు వస్తు వినియోగం, సేవారంగాలలో లోతుగా కలిసిపోయాయన్నారు. అందుకే అమెరికా వస్తు బహిష్కరణ సాధ్యం కాదన్నారు.