అరుదైన, కీలకమైన ఖనిజాల సరఫరాలో పరస్పర సహకారం
చరిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేసిన ఇరుదేశాలు
న్యూఢిల్లీ: అరుదైన, కీలకమైన ఖనిజాల సరఫరాలో పరస్పర సహకారమే లక్ష్యంగా భారత్, అమెరికాలు చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అరుదైన భూ ఖనిజాలు, వ్యూహాత్మక లోహాల సరఫరా, ఎగుమతులపై చైనా విధిస్తున్న నియంత్రణల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఇకపై పరస్పరం సహకరించుకోవాలని ఇరుదేశాలు నిర్ణయానికి వచ్చాయి. ఈ మేరకు ఒప్పందంపై మంగళవారం సంతకాలు చేశాయి.
🇮🇳🇺🇸 India & the U.S. just signed a landmark deal to secure supply chains for critical minerals & rare earths- cutting dependence on China & boosting strategic self-reliance. pic.twitter.com/bl3NJeLY4x
— The Alternate Media (@AlternateMediaX) May 26, 2026
కీలక ఖనిజాల తవ్వకం, శుద్ధి, సరఫరా విషయంలో స్థిరత్వం సాధించాలని, ఇరుదేశాలు లాభపడేలా కలసికట్టుగా ముందుకెళ్లాలని నిర్ణయానికి వచ్చాయి. ఢిల్లీలో ‘క్వాడ్’ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. ఇది చాలా సమయోచితమైన, కీలకమైన నిర్ణయమని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టంచేశారు. మైనింగ్, ప్రాసెసింగ్, రీసైక్లింగ్, సంబంధిత పెట్టుబడులతో సహా అరుదైన ఖనిజాలు, లోహాల సరఫరాలో సహకారాన్ని మరింతగా పెంపొందించడమే ఈ ఫ్రేమ్‌వర్క్ లక్ష్యమని ఉద్ఘాటించారు.
ఇదీ చదవండి: బైజూస్ ఫౌండర్‌కి ఆర్నెల్ల జైలు, రవీంద్రన్ స్పందన ఇదీ!
పటిష్టమైన, వైవిధ్యభరితమైన సప్లైచైన్లను ఇది మరింత బలోపేతం చేస్తుందన్నారు. మైనింగ్, ప్రాసెసింగ్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం లభిస్తుందని, ఖనిజాలు, లోహాల సమర్థవంతమైన నిర్వహణను దోహద పడుతుందని వివరించారు. ఎన్నో సవాళ్లు, అదే సమయంలో ఎన్నో అవకాశాలు ఉన్న ఈ ప్రపంచంలో భారత్, అమెరికాల మధ్య సహకారం ఎంత సన్నిహితంగా ఉందో చెప్పడానికి ఈ ఒప్పందం ఒక ప్రతీక అని వ్యాఖ్యానించారు. భారత్, అమెరికాల మధ్య బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గుర్తుచేశారు. రెండు దేశాల జాతీయ ప్రయోజనాల దృష్ట్యా వ్యూహాత్మక భాగస్వామ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఉందన్నారు. ఇరుదేశాల మధ్య బలమైన స్నేహ సంబంధాలకు తాజా ఒప్పందమే ఒక ఉదాహరణ అని వెల్లడించారు. మన ఆవిష్కరణల ఆర్థిక వ్యవస్థకు(ఇన్నోవేషన్ ఎకానమీ) ఖనిజాలు, సప్లై చైన్లు చాలా ముఖ్యమని తెలిపారు.
ఇదీ చదవండి: 11 రోజుల్లోనే ... హమాస్ కీలక నేత హతం


