ఐరాసలో గాజా మానవతా సంధి తీర్మానానికి ఓటేయని భారత్‌

India refuses to back UN General Assembly vote on Gaza ceasefire - Sakshi

ఇజ్రాయెల్-హమాస్ వివాదంలో.. తక్షణ మానవతావాద సంధికి పిలుపునిచ్చిన తీర్మానంపై ఐక్యరాజ్య సమితిలో జరిగిన ఓటింగ్‌కు భారత్‌ గైర్హాజరయ్యింది. గాజాలో మానవతా దృక్పథంతో సంధి కుదర్చాలనే పలు ప్రతిపాదనలపై ఐరాస జనరల్‌ అసెంబ్లీలో  ఓటింగ్‌ జరిగింది. మొత్తం 193 సభ్యదేశాలున్న జనరల్‌ అసెంబ్లీలో ఓటింగ్‌లో మొత్తం 179 సభ్య దేశాలు పాల్గొన్నాయి. ఈ ప్రతిపాదనలకు అనుకూలంగా 120 దేశాలు ఓటు వేశాయి. 14 దేశాలు వ్యతిరేకించాయి. అయితే 45 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరు కాగా.. అందులో భారత్‌ కూడా ఉంది. 

ఐరాస జనరల్‌ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌ భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్‌, ఉక్రెయిన్‌, యూకే దూరంగా ఉన్నాయి. ‘‘పౌరుల రక్షణ,  చట్టపరమైన & మానవతా బాధ్యతలను సమర్థించడం’’ పేరిట జోర్దాన్‌ ఈ తీర్మానం ప్రతిపాదించింది.  బంగ్లాదేశ్‌, మాల్దీవ్స్‌, పాకిస్తాన్‌, దక్షిణాఫ్రికా, రష్యా సహా 40 దేశాలు మద్దతు తీర్మానానికి ఇచ్చాయి. గాజా స్ట్రిప్‌లో నివసిస్తోన్న వారికి మానవత దృక్పథంతో సహాయం అందించడం, వారికోసం ప్రత్యేకంగా కారిడార్‌ను ఏర్పాటు చేయడం.. వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.

అయితే.. ఈ అనూహ్య నిర్ణయానికి గల కారణాల్ని భారత్‌ వివరించింది. తీర్మానంలో ఎక్కడా హమాస్ గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంది. ఈ విషయంలో జోర్డాన్‌ తీరును తప్పు పట్టింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి స్పష్టమైన సందేశం పంపాల్సిన అవసరం ఉందని భారత్‌ తన నిర్ణయాన్ని వివరించింది. "ఈ అసెంబ్లీ చర్చలు ఉగ్రవాదం, హింసకు వ్యతిరేకంగా స్పష్టమైన సందేశాన్ని పంపుతాయని,  దౌత్యం-చర్చల అవకాశాలను విస్తరింపజేస్తాయని మేము ఆశిస్తున్నాము" అని ఐక్యరాజ్యసమితిలో భారతదేశం యొక్క డిప్యూటీ శాశ్వత ప్రతినిధి యోజనా పటేల్ అన్నారు. 

ఓటింగ్‌కు దూరంగా ఉంటూనే కెనడా చేసిన సవరణలను భారత్ సమర్థించింది. ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడులు.. అనే వాక్యాన్ని ఈ ప్రతిపాదనల్లో చేర్చాలంటూ కెనడా సవరణలను సూచించగా.. భారత్ సమర్థించింది. ఈ సవరణలు చేయగలిగితే తాము ఓటింగ్‌లో పాల్గొంటామని యోజనా ముందుగానే తెలిపారు. కానీ, అది జరగలేదు. జోర్డాన్ రూపొందించిన తీర్మానంలో హమాస్ గురించి ప్రస్తావన లేకపోవడంపై అమెరికా సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది.

హమాస్, వారి చెరలో బందీలు.. అనే పదాలను జోర్డాన్ రూపొందించిన డ్రాఫ్ట్‌లో చేర్చాలనేది కెనడా డిమాండ్. కెనడా ప్రతిపాదించిన ఈ సవరణలను ఇందులో చేర్చడానికి ఓటింగ్ సైతం నిర్వహించింది ఐరాస. దీనికి అనుకూలంగా భారత్‌ సహా 87 దేశాలు ఓటు వేశాయి. అయితే.. మూడింట రెండొంతుల మెజారిటీ లేకపోవడంతో ఇది ఆమోదం పొందలేకపోయింది.

అక్టోబర్‌ 7వ తేదీన ఇజ్రాయెల్‌ సరిహద్దు ప్రాంతాల్లో మెరుపు దాడులకు దిగింది హమాస్‌. సరిహద్దులను దాటుకుని ఇజ్రాయెల్ భూభాగంపైకి చొచ్చుకుని వచ్చి.. పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంది. దీంతో సైన్యంతో ఎదురుదాడికి దిగిన ఇజ్రాయెల్‌.. ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్‌ చేపట్టింది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. వైమానిక దాడులతో నిప్పులు కురిపిస్తోంది. ఫలితంగా.. గాజా ఛిద్రమైపోయింది.  యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. ఇజ్రాయెల్- హమాస్ పరస్పర దాడుల్లో ఇప్పటికి 6,700 మందికి పైగా మరణించారు. అదే స్థాయిలో వేలాదిమంది గాయపడ్డారు. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. దాడులు తీవ్రతరమౌతోన్న కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top