వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చమత్కారం చేశారు. ఇరాన్‌తో తనకు ప్రాణహాని ఉందని తను బయిటకే వెళితే చంపేసే అవకాశం ఉందన్నారు. అందువలనే తన కుమారుడి వివాహానికి హాజరుకానని తెలిపారు. అయితే ఒకవేళ తను హాజరైనా కాకపోయిన తప్పుడు వార్తలతో తనకు మరణ తథ్యమని మీడియాకు చురకలంటించారు.
ట్రంప్ వ్యవహారశైలి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడుతారో ఆయనకే తెలియదు. అందుకే ట్రంప్ మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో తాను ఏ వేడుకలకు వెళ్లలేనని ఒకవేళ వెళితే తనను చంపేస్తారన్నారు.
ఓవల్‌లోని తన కార్యాలయంలో మాట్లాడుతూ.. "నేను వెళ్లాలని అనుకుంటున్నాను. అయితే నేను వెళ్లడానికి ఇది సరైన సమయం కాదు. ప్రస్తుతం నాకు ఇరాన్ అనే ఒక వ్యవహారం ఉంది. ఒక వేళ నేను వెళ్లినా చంపుతారు. వెళ్లకపోయినా చంపుతారు. అయితే అది తప్పుడు వార్తల వల్ల" అని చమత్కరిస్తూ మాట్లాడారు. తాను పెళ్లికి హాజరైనా, కాకపోయినా మీడియా నుంచి ఎదురయ్యే విమర్శల గురించి ప్రస్తావిస్తూ ఆ విషయంలో నేను గెలవలేను అని ఆయన అన్నారు.
అయితే ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ వివాహం ఈ వారాంతంలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ప్రైవేట్ వేడుకలో పామ్ బీచ్ సోషలైట్ మోడల్.. బెట్టినా అండర్సన్‌ను వివాహం చేసుకోబోతున్నారని సమాచారం. అయితే ఈ వేడుకకు అత్యంత సన్నిహితులను మాత్రమే ఆహ్వనించారని తెలుస్తోంది. అంతర్జాతీయ పరిణామాలు, అధ్యక్షుడి పర్యటనకు సంబంధించిన భద్రతాపరమైన ఆందోళనల కారణంగా తన హాజరు అనిశ్చితంగా ఉందని ట్రంప్ సూచించారు.


