అమ్మను దూరం చేసి.. పసివాడిని బలి తీసుకున్న ట్రంప్‌ యంత్రాంగం  | ICE deports woman without 2-year-old son, now charges her with murder | Sakshi
Sakshi News home page

అమ్మను దూరం చేసి.. పసివాడిని బలి తీసుకున్న ట్రంప్‌ యంత్రాంగం 

May 18 2026 4:51 AM | Updated on May 18 2026 6:22 AM

ICE deports woman without 2-year-old son, now charges her with murder

ఫ్లోరిడా: అమెరికాలోని ట్రంప్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన కఠినమైన వలసవిధానాలు పరోక్షంగా ఓ చిన్నారి ప్రాణాలను బలితీసుకున్నాయి. అమెరికా ఇమిగ్రేషన్‌ అధికారులు హోండురాస్‌ మూలాలున్న ఓ తల్లి, ఆమె రెండేళ్ల కుమారుడిని వేరు చేశారు. గతిలేక ఆ తల్లి తన కుమారుడిని బంధువుల ఇంట్లో వదిలేసి వెళ్లగా ఇప్పుడా అబ్బాయి విగతజీవిగా కన్పించాడు. 

ఈ ఉదంతంలో తల్లిదే తప్పు అంటూ అధికారుల వింతవాదనపై  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  హోండురాస్‌ దేశానికి చెందిన వెండీ హెర్నాండెజ్‌ రెయెస్‌ తన రెండేళ్ల కుమారుడు ఆర్లిన్‌ జోసీతో కలిసి ఫ్లోరిడాలోని ఎస్కాంబియా కౌంటీలో నివసిస్తోంది. జనవరిలో లూసియానాలో ఓ రోజు నిర్మాణ పనులకు వెళ్లగా అక్కడి సిబ్బంది ఆమెను, మరికొందరిని అక్రమ వలసదారులంటూ ఇమిగ్రేషన్‌ అధికారులకు అప్పగించారు. 

అధికారులు వెండీని నిర్బంధ కేంద్రంలో బంధించారు. రెండేళ్ల ఆర్లిన్‌ నిర్బంధ కేంద్రంలో ఉండటం కుదరదని అధికారులు తెగేసి చెప్పారు. దీంతో చేసేదిలేక ఆమె తన కుమారుడిని ఫ్లోరిడాలోని ఎస్కాంబియా కౌంటీలో ఉండే బంధువుæ మల్డోనాడోకి అప్పగించింది. అధికారులు నెల రోజుల్లోనే ఆమెను  హొండురస్‌కు బలవంతంగా పంపేశారు. 

బంధువుల ఇంట్లో ఉన్న తన కుమారుడు తీసుకురావాలని అధికారులను ఎంతగా వేడుకున్నా వాళ్లు కనికరం చూపలేదు. ఆర్లిన్‌ సంరక్షణా బాధ్యతలు తీసుకున్న మల్డోనాడో సైతం అక్రమ వలసదారుడే.  గతంలో  నేరాలకు పాల్పడ్డాడు. అతడి చిత్రహింసల తాళలేక ఆర్లిన్‌ మార్చి నెలలో ప్రాణాలు కోల్పోయాడు. శరీరమంతటా గాయాలతో నిండిపోయింది. పిల్లాడి మృతి వార్త తెలిసి స్థానిక పోలీసుఅధికారులు మల్డోనాడోను అరెస్ట్‌ చేశారు. 

అయితే చిన్నారి మరణానికి ఆమె తల్లే పరోక్షంగా కారణమని, తాము చెప్పినా వినకుండా ఆర్లిన్‌ను వదిలేసి వెళ్లిందని ఇమిగ్రేషన్‌ అధికారులు వాదిస్తున్నారు. ఈ వాదనలను తల్లి తీవ్రంగా ఖండించారు. తన వెంట కుమారుడిని తీసుకెళ్తానని ఎంత మొత్తుకున్నా అధికారులు వినిపించుకోలేదని, ఇప్పుడు తిరిగి నింద తనపై మోపుతున్నారని ఆమె ఏడుస్తూ చెప్పారు. ప్రాణంగా చూసుకుంటున్న కన్న కొడుకును రాక్షసుడి చేతుల్లో పెట్టి వదిలేసి వెళ్లిపోయేంతటి కర్కశురాలిని కాదంటూ ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement