కైరో: గాజా నగరంపై గట్టి పట్టున్న హమాస్‌తో అమీతుమీ తేల్చుకుంటామంటూ భారీగా సైనికులను రంగంలోకి దించిన ఇజ్రాయెల్ ఆర్మీ.. దాడుల తీవ్రతను కొనసాగిస్తోంది. శుక్రవారం రాత్రి నుంచి ఇజ్రాయెల్ ఆర్మీ గాజా వ్యాప్తంగా చేపట్టిన దాడుల్లో కనీసం 43 మంది ప్రాణాలు కోల్పోయారని అల్‌జజీరా తెలిపింది. వీరిలో గాజా నగరంలోని షావా స్క్వేర్ సమీపంలో జరిగిన దాడిలో ఐదుగురు, మరో దాడిలో ఒకే కుటుంబంలోని ఆరు గురు చనిపోయారని ఆరోగ్య విభాగం తెలిపింది. వీరు షిఫా ఆస్పత్రి డైరెక్టర్ మహ్మద్ అబూ సెల్మియా బంధువులని ఆస్పత్రి ఎండీ రమీ ఎమ్‌హన్నా చెప్పారు.
ఇలాఉండగా, గత 23 నెలలుగా ఇజ్రాయెల్ ఆర్మీ యథేచ్ఛగా సాగిస్తున్న దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య 65, 100 దాటిపోయింది. భవనాలను నేలమట్టం చేస్తుండటంతో గాజా ప్రాంతంలో ఉన్న కనీసం 90 శాతం మంది పాలస్తీ నియన్లకు నిలువ నీడ కూడా లేకుండాపోయింది. దాదాపు సగం మంది, అంటే సుమారు 4.50 లక్షల మంది గాజా నగరాన్ని వీడి వెళ్లిపోయినట్లు పాలస్తీనా సివిల్ డిఫెన్స్ విభాగం తెలిపింది. ఇలాఉండగా, గాజా ప్రాంతంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న వేలాది మంది చిన్నారుల కోసం తీసుకువచ్చిన అత్యవసర ఆహార పదార్థాలున్న నాలుగు ట్రక్కులను సాయుధులు వచ్చి తరలించుకుపోయారని యునిసెఫ్ శుక్రవారం తెలిపింది.