పగటి పూట బొమ్మలా.. రాత్రిపూట ‘దెయ్యం’లా! పదేళ్ల తర్వాత..

Ghost Woman Sitting Near UK Highway Revealed Frank After Ten Years - Sakshi

దెయ్యం కథలు.. నమ్మకం ఉన్నా.. ‘ఛస్‌’ అని ఛీదరించుకున్నా వీటి గురించి ఆసక్తి కలగక మానదు. ఎందుకంటే ఆ కథల్లోని నేరేషన్‌ అలా ఉంటుంది కాబట్టి.   ఇప్పుడు చెప్పుకోబోయే యూకే ‘బెట్టీ బైపాస్‌’ కొంత క్యూరియాసిటీని రేకెత్తించడం ఖాయం!. ఎందుకంటే ఈ దెయ్యం ఈమధ్యే పదేళ్లు పూర్తి చేసుకుంది కాబట్టి!.  

బర్మింగ్‌హమ్‌-వోర్‌సెయిస్టర్‌ సరిహద్దు. హైవే కావడంతో వాహనాల రద్దీ ఎక్కువే!. చెక్‌పోస్ట్‌కి దగ్గర్లో ఒక శాండ్‌విచ్‌ ట్రక్‌ ఉంటుంది. ఆ నిర్వాహకులు ఏర్పాటు చేసిన బెంచ్‌ మీద కనిపించే ఒక రూపాన్ని చూసి ఎవరైనా వణికిపోతుంటారు. కారణం..  గత పదేళ్లుగా ఆ రూపం అక్కడక్కడే తిరుగుతోంది. ఆ రూపం పేరు ‘బెట్టీ’..  పక్కనే పిల్లల్ని వేసుకుని తిరిగే ఓ వీల్‌ ఊయల కూడా ఉంటుంది. పగలు బెంచ్‌ మీద కనిపించే ఆ రూపం.. రాత్రిపూట దెయ్యంగా మారుతుందనే ప్రచారం నడుస్తుంది. అందుకే ఈ దారికి కూడా ‘బెట్టీ బైపాస్‌’ అని పేరొచ్చింది.

 

బిడ్డను కోల్పోయిన ఆ తల్లి దెయ్యంగా మారి.. అలా హైవేపై తిరుగుతోందని, ఎవరో ఆమెను యాక్సిడెంట్‌ చేసి చంపేశారని, కాదు కాదు.. ఆమె భర్తే ఆమెను చంపేశాడని.. ఇలా రకరకాల ప్రచారాలు వినిపిస్తుంటాయి. బెట్టీ మీద సింపథీ ఉన్నా.. దెయ్యం అనే ఊహ మాత్రం చాలామందిని వణికించేది. దీంతో ఈ మిస్టరీని చేధించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఏళ్లు గడుస్తున్నా.. ఆ ఘోస్ట్‌ లేడీ వ్యవహారాన్ని ఎవరూ తేల్చలేకపోయారు.

ఈలోపు ఆ నోటా ఈ నోటా పాకి ఈ దెయ్యం కథ.. దెయ్యాల మీద అన్వేషణ చేసే వాళ్లకు, అంతర్జాతీయ మీడియా హౌజ్‌ దృష్టికి చేరింది. ఎవరికి వాళ్లు ఈ మిస్టరీని చేధించాలని ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో పగలబడి నవ్వుకున్నారు. కారణం.. అదొక ప్రాక్టికల్‌ జోక్‌ కాబట్టి! 

బెట్టీ ఒక షోకేజ్‌ బొమ్మ. దానిని అక్కడ తీసుకొచ్చి పెట్టిన వ్యక్తి పేరు నిక్‌ హజ్బెండ్‌. ఆయన ఆ శాండ్‌విచ్‌ ట్రక్‌ యజమాని.  ఓ ఛారిటీ షాప్‌ నుంచి ఆ షోకేజ్‌ బొమ్మను కొనుక్కొచ్చి.. దానికి బెట్టీ అనే పేరు పెట్టి రోజూ దానిని రకరకాల యాంగిల్స్‌లో అక్కడి బెంచ్‌ల మీద కూర్చోబెడుతున్నాడు. అలా పదేళ్లు గడిచిపోయింది. ఈలోపు హైవే మీద వెళ్లే చాలామంది.. ప్రత్యేకించి రాత్రిళ్లు ఆ బొమ్మను చూసి వణికిపోయేవాళ్లట. పైగా అది అక్కడక్కడే ఉండడం, నిక్‌ చెప్పిన కల్పిత కథలతో అదొక దెయ్యం అని బలంగా ఫిక్స్‌ అయిపోయారు. అలా బెట్టీ కథ చుట్టుపక్కల పాకేసింది.

పాపం అనుకున్నారట.. 

ప్రాక్టికల్‌ జోక్స్‌తో ఇంట్లో వాళ్లను ఫూల్స్‌ చేసే నిక్‌.. జనాలందరినీ భయపెట్టాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేశాడు. అయితే పగటిపూట ఆ ఫుడ్‌ ట్రక్‌ దగ్గర ఆగిన కొందరు.. బెట్టీ గురించి అడిగినప్పుడు వాళ్లకు రకరకాల కథలు చెప్పేవాడు.  ఆమె భర్త చేతిలో మోసపోయినా ఒక అనాథ అని, అందుకే బిడ్డతో అక్కడ అలా కూర్చుంటుందని(సజీవంగా ఉందని నమ్మించాడు కూడా!) చెప్పడంతో చాలామంది ‘పాపం’ అని సాయం చేసేందుకు ముందుకు వచ్చేవాళ్లట. తీరా అదొక బొమ్మ అని తెలిశాక నిక్‌ను తిట్టుకుంటూ.. సరదాగా ఫొటోలు తీసుకుని వెళ్లిపోయేవాళ్లట. కొన్నాళ్ల తర్వాత నిక్‌, ఆ ప్రమ్‌(తిప్పే ఊయల)ని మాయం చేయడంతో బిడ్డ గురించి ఆరా తీసేవాళ్లట.

వాళ్లకు ఆ బిడ్డ పెరిగి.. స్కూల్‌కు వెళ్తోందని చెప్పేవాడట. ఇలా జనాలందరికీ ఒక్కో రకమైన కథ చెప్పి బురిడీ కొట్టించేవాడు ఆ ట్రక్కు యజమాని.  ఒకానొక టైంలో కౌన్సిల్‌ ఆఫీసర్లు సైతం ఆ అనాథ మహిళకు సాయం చేయాలని ముందుకొచ్చారట. కానీ, అదొక బొమ్మ అని తెలిశాక.. నిక్‌కు వార్నింగ్‌ఇచ్చి మరీ బెట్టీతో ఫొటోలు దిగి వెళ్లిపోయారట. మొత్తానికి బెట్టీ తన కుటుంబంలో ఒక భాగం అయ్యిందని, ఆ బొమ్మకు చేసిన 20 పౌండ్ల ఖర్చు తన వ్యాపారానికి ఎంతో సాయం ఇప్పుడు చేస్తోందని సంతోషపడుతున్నాడు నిక్‌. మొత్తానికి పదేళ్లపాటు జనాలను బురిడీ కొట్టించాడు ఈ పెద్దాయన.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top