2024: ఎన్నికల ఏడాది | Sakshi
Sakshi News home page

2024: ఎన్నికల ఏడాది

Published Sat, Jan 6 2024 4:54 AM

Elections Around the World in 2024: 2024 is the biggest global election year in history - Sakshi

2024ను ఎన్నికల ఏడాదిగా పిలవాలేమో. ఎందుకంటే ఈ ఏడాది ఏకంగా 50కి పైగా దేశాల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి! ఒక్క ఏడాదిలో ఇన్ని దేశాల్లో ఎన్నికలు జరగడం చరిత్రలో ఇదే తొలిసారి. అలా 2024 రికార్డులకెక్కబోతోంది. పైగా అత్యధిక జనాభా ఉన్న టాప్‌ 10 దేశాల్లో ఏకంగా ఏడు ఈసారి ఎన్నికల పోరుకు సిద్ధమవుతుండటం విశేషం. ఆ లెక్కన ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది ఈ ఏడు ఓటు హక్కును వినియోగించుకోనుండటం ఇంకో విశేషం! ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న భారత్‌ మొదలుకుని అగ్ర రాజ్యం అమెరికా దాకా ఈ జాబితాలో ఉన్న ముఖ్యమైన దేశాలను ఓసారి చూద్దాం...                       

బంగ్లాదేశ్‌
17 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్‌ ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న తొలి దేశం. జనవరి 7న అక్కడ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే విపక్షాలన్నింటినీ నిరీ్వర్యం చేసి ఏకపక్ష ఎన్నికల ప్రహసనానికి తెర తీశారంటూ ప్రధాని షేక్‌ హసీనా ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ అణచివేతను తట్టుకోలేక పలువురు విపక్ష నేతలు ప్రవాసంలో గడుపుతున్నారు. బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పారీ్టతో పాటు విపక్షాలన్నీ బాయ్‌కాట్‌ చేసిన ఈ ఎన్నికల్లో హసీనా మరోసారి నెగ్గడం, వరుసగా ఐదోసారి అధికారంలోకి రావడం లాంఛనమే కానుంది. ప్రజాస్వామ్యానికి చెల్లుచీటీ పాడి చైనా మాదిరిగా దేశంలో హసీనా ఏక పార్టీ వ్యవస్థను నెలకొల్పేలా ఉన్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తైవాన్‌
చైనా పడగ నీడన తన స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకునేందుకు ఆపసోపాలు పడుతున్న తైవాన్‌లో జనవరి 13న అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార డీపీపీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు సై ఇంగ్‌ వెన్‌కు బదులుగా లై చింగ్‌ టే బరిలో ఉన్నారు. ఆయనకు వెన్‌కు మించిన స్వాతంత్య్ర ప్రియునిగా పేరుంది. ఉదారవాద క్యోమింటాంగ్‌ నేత హో యూ యీ, తైవాన్‌ పీపుల్స్‌ పార్టీ తరఫున కో వెన్‌ జే ఆయనను సవాలు చేస్తున్నారు. డీపీపీ 2016 నుంచీ అధికారంలో కొనసాగుతోంది. ఈసారి కూడా అది అధికారంలోకి వస్తే యుద్ధానికి దిగైనా తైవాన్‌ను విలీనం చేసుకుంటానంటూ చైనా ఇప్పటికే బెదిరిస్తోంది. దాంతో ఈ ఎన్నికలు తైవాన్‌కు ఒకరకంగా జీవన్మరణ సమస్యగా పరిణమించాయి.

పాకిస్తాన్‌
24 కోట్ల జనాభా ఉన్న పాక్‌ అనిశి్చతికి మారుపేరు. షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 8న సార్వత్రిక ఎన్నికలు జరగాలి. కానీ అవి వాయిదా పడే సూచనలే ఎక్కువగా కని్పస్తున్నాయి. సైన్యాన్ని ఎదిరించి ప్రధాని పదవి కోల్పోయి అవినీతి కేసుల్లో జైలు పాలైన పీటీఐ చీఫ్‌ ఇమ్రాన్‌ఖాన్‌ పోటీకి దారులు మూసుకుపోయినట్టు కని్పస్తున్నాయి. ఆయన నామినేషన్లు ఇప్పటికే తిరస్కరణకు గురయ్యాయి. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగడం అనుమానంగా మారింది. సైన్యం దన్నుతో పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ (పీఎంఎల్‌) విజయం, ప్రవాసం నుంచి తిరిగొచి్చన ఆ పార్టీ నేత నవాజ్‌ షరీఫ్‌ మరోసారి ప్రధాని కావడం లాంఛనమేనని అక్కడి రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

ఇండొనేసియా
27 కోట్ల పై చిలుకు జనాభా ఉన్న ఇండొనేసియాలో కూడా ఫిబ్రవరిలో ఎన్నికలున్నాయి. అధ్యక్షుడు, ఉపాధ్యక్షునితో పాటు జిల్లా, రాష్ట్ర, జాతీయ పార్లమెంటు సభ్యులకు ఫిబ్రవరి 14న ఒకే రోజున ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రెండు టర్ములు పూర్తి చేసుకున్న అధ్యక్షుడు జొకో విడొడొ స్థానంలో రక్షణ మంత్రి 72 ఏళ్ల ప్రాబొవో సుబియంటో బరిలో ఉన్నారు. గంజర్‌ ప్రనోవో, అనీస్‌ బస్వేదన్‌ గట్టి పోటీ ఇస్తున్నారు.

భారత్‌
140 కోట్లకు పైగా జనాభా, 90 కోట్ల పై చిలుకు ఓటర్లతో ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ప్రజాస్వామ్యంగా అలరారుతున్న భారత్‌ ఏప్రిల్, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతోంది. ఇన్ని కోట్ల మంది ఓటర్లు అత్యంత శాంతియుతంగా, ప్రజాస్వామికంగా ఓటు హక్కును వినియోగించుకోవడాన్ని ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ప్రపంచమంతా అబ్బురపాటుతో వీక్షించడం పరిపాటిగా మారింది. ఈ ఎన్నికల్లో ప్రధానిగా నరేంద్ర మోదీ హ్యాట్రిక్‌ ఖాయమని అత్యధిక రాజకీయ అంచనాలు చెబుతున్నాయి. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిని 2014లో ఆయన ఒంటి చేత్తో అధికారంలోకి తేవడం తెలిసిందే. 2019లోనూ మోదీ మేజిక్‌ రిపీటైంది. ఈసారి దానికి ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్‌ సారథ్యంలో 28 విపక్ష పారీ్టలతో కూడిన విపక్ష ఇండియా కూటమి ప్రయతి్నస్తోంది.

మెక్సికో
జూన్‌ 2న ఎన్నికలకు మెక్సికో సిద్ధమవుతోంది. 13 కోట్ల జనాభా ఉన్న ఈ దేశ చరిత్రలోనే తొలిసారిగా అధ్యక్ష పదవితో పాటు మొత్తం 32 రాష్ట్రాల గవర్నర్లు, జాతీయ కాంగ్రెస్, స్థానిక సంస్థల స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. క్లాడియా షేన్‌బామ్‌ రూపంలో ఈసారి తొలిసారిగా ఓ మహిళ అధ్యక్ష పదవి చేపట్టే ఆస్కారం కనిపిస్తుండటంతో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. సైంటిస్టు, మెక్సికో సిటీ మాజీ మేయర్‌ అయిన ఆమె అధికార మొరేనా పార్టీ తరఫున బరిలో దిగుతున్నారు.

యూరోపియన్‌ యూనియన్‌
యూరోపియన్‌ యూనియన్‌లోని మొత్తం 27 దేశాల ప్రజలూ కీలకమైన ప్రతి ఐదేళ్లకోసారి  యూరప్‌ పార్లమెంటులో తమ ప్రతినిధులను ప్రత్యక్ష ఓటింగ్‌ పద్ధతిలో ఎన్నుకుంటారు. విద్య, వైద్యం మొదలుకుని ఉపాధి దాకా ఆ దేశాలను తీవ్రంగా ప్రభావితం చేసే పలు కీలక రంగాలకు సంబంధించి నిర్ణాయక చట్టాలు చేయడంలో పార్లమెంటుదే కీలక పాత్ర. దాంతో జూన్‌ 6 నుంచి 9 దాకా జరగనున్న ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం 720 మంది పార్లమెంటు సభ్యులు ఎన్నికవుతారు.

దక్షిణాఫ్రికా
6 కోట్ల పై చిలుకు జనాభా ఉన్న ఈ దేశంలో మే–ఆగస్టు మధ్య సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. 1994లో దేశంలో వర్ణ వివక్ష అంతమయ్యాక జరుగుతున్న ఏడో ఎన్నికలివి. అప్పటినుంచీ అధికారంలో కొనసాగుతున్న ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (ఏఎన్‌సీ) ఈసారి విజయానికి కావాల్సిన 50 శాతం మార్కును దాటడం కష్టకాలమేనంటున్నారు. గత అక్టోబర్‌లో జరిగిన సర్వేలో ఆ పారీ్టకి మద్దతు 45 శాతానికి పడిపోయింది. అవినీతి మకిలి అధ్యక్షుడు సిరిల్‌ రామాఫోసాకు ఈసారి ప్రధాన అడ్డంకిగా మారేలా కని్పస్తోంది. అధికారంలోకి వస్తూనే పూర్వ అధ్యక్షుడు జాకబ్‌ జుమా అవినీతిని క్షమించడం తీవ్ర వ్యతిరేకతకు దారి తీసింది. అధికారుల్లో పెచ్చరిల్లిన అవినీతి పరిస్థితిని ఏఎన్‌సీకి మరింత ప్రతికూలంగా మార్చిందంటున్నారు. విపక్ష డెమొక్రటిక్‌ అలయెన్స్‌ దానికి గట్టిపోటీ ఇచ్చేలా కని్పస్తోంది.

అమెరికా
33 కోట్ల పై చిలుకు జనాభా ఉన్న అగ్ర రాజ్యంలో అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడూ ప్రపంచాన్ని ఆకర్షించేవే. అధ్యక్షున్ని ఎన్నుకోవడంతో పాటు ప్రతినిధుల సభలో మొత్తం స్థానాలతో పాటు సెనేట్లో మూడో వంతు సీట్లకు కూడా పోలింగ్‌ జరుగుతుంది. అయితే ఈసారి నవంబర్‌ 5న జరగనున్న ఎన్నికలపై మరింత ఆసక్తి నెలకొనేలా ఉంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెంపరితనమే అందుకు ఏకైక కారణం! 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని ఒప్పుకునేందుకు ఆయన ససేమిరా అనడం, తననే విజేతగా ప్రకటించాలంటూ మొండికేయడం తెలిసిందే. డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ను అధ్యక్షునిగా ప్రకటించకుండా అడ్డుకునేందుకు ఏకంగా క్యాపిటల్‌ భవనంపైకి తన మద్దతుదారులను దాడికి ఉసిగొల్పారు ట్రంప్‌. ఆ కేసులో ఆయన దోషిగా తేలడం, ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అనర్హునిగా మారే ప్రమాదంలో పడటం విశేషం! ఈ గండం గట్టెక్కితే ట్రంప్‌ మరోసారి బైడెన్‌తోనే తలపడతారు.

ఘనా
3 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో డిసెంబర్‌ 7న ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా రెండోసారి అధ్యక్షునిగా కొనసాగుతున్న ననా అకుఫో అడో స్థానంలో కొత్త నేతను ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. అధికార న్యూ పేట్రియాటిక్‌ పార్టీ, విపక్ష నేషనల్‌ డెమొక్రటిక్‌ కాంగ్రెస్‌ మధ్య ఈసారి హోరాహోరీ ఖాయమంటున్నారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement