
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హమాస్‌కు తుది హెచ్చరిక జారీ చేశారు. గాజా నుండి బందీలను విడుదల చేయడానికి ఉద్దేశించిన ఒప్పందాన్ని అంగీకరించాలని ట్రంప్ పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు హమాస్‌ను కోరారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ ఏడున ‘ఇజ్రాయెల్ ప్రజలు నా నిబంధనలను అంగీకరించారు. హమాస్ కూడా అంగీకరించాల్సిన సమయం ఆసన్నమైంది’ అని తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్ పోస్ట్‌లో రాశారు.
‘ఒప్పందాన్ని అంగీకరించకపోతే వచ్చే పరిణామాల గురించి ఇప్పటికే హమాస్‌ను హెచ్చరించాను. ఇది నా తుది హెచ్చరిక, మరొకటి ఉండదు’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఇదేవిధంగా విలేకరులతో మాట్లాడిన ఆయన గాజా ఒప్పందానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. ‘గాజాపై మనం త్వరలోనే ఒక ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. బందీల తిరిగి తెచ్చుకుంటామని ఆశిస్తున్నాను. గాజా యుద్ధం మేము పరిష్కరించాలనుకుంటున్న పెద్ద సమస్య’ అని ట్రంప్ అన్నారు.
.@POTUS: "I think we're going to have a deal on Gaza very soon. It's a hell of a problem... I think we're going to get [all the hostages]." pic.twitter.com/KZmYAEFLQn
— Rapid Response 47 (@RapidResponse47) September 7, 2025
గాజాలో మిగిలిన బందీల గురించి ట్రంప్ మాట్లాడుతూ యుద్ధం 23వ నెలలోకి అడుగుపెడుతున్నందున అక్కడ మిగిలిన బందీల సంఖ్య 20 కంటే తక్కువగా ఉండవచ్చన్నారు. వారిలో చాలామంది చనిపోయి ఉండవచ్చన్నారు. కాగా ఈ ఒప్పందం ప్రకారం హమాస్ దగ్గర మిగిలిన 48 మంది బందీలను ఇజ్రాయెల్ జైలులో ఉన్న వేలాది మంది పాలస్తీనా ఖైదీలకు బదులుగా కాల్పుల విరమణ మొదటి రోజునే విడుదల చేయాలి. కాల్పుల విరమణ సమయంలో యుద్ధాన్ని ముగించడానికి చర్చలు జరపాలి. కాగా ట్రంప్ ప్రతిపాదనను ఇజ్రాయెల్ పరిశీలిస్తోందని ఆ దేశ విదేశాంగ మంత్రి గిడియాన్ సర్ అన్నారు. హమాస్ బందీలను విడుదల చేసి, ఆయుధాలను వదిలివేస్తే గాజాలో యుద్ధం ముగించవచ్చన్నారు.