
వాషింగ్టన్: పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చాలా అవమానకరంగా జరిగాయని విమర్శించారు. ప్రముఖ చిత్రకారుడు లియొనార్డో డావిన్సీ గీసిన ‘లాస్ట్ సప్పర్’ పెయింట్ స్ఫూర్తితో చేసిన ప్రదర్శన ఓ వర్గం విశ్వాసాలను కించపర్చేటట్లు ఉందని విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. దీన్ని ఉద్దేశించే ట్రంప్ తాజా వ్యాఖ్యలు చేశారు. అయితే, ఒలింపిక్స్ నిర్వాహకులు మాత్రం ఏ మతాచారాలను ఉద్దేశించి ఆ ప్రదర్శన చేయలేదని వివరణ ఇచ్చారు.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘చాలా ఓపెన్‌గా మాట్లాడే మనస్తత్వం నాది. ఏదిఏమైనా పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలోని కార్యక్రమాలు అవమానకంగా ఉన్నాయి’’ అని అన్నారు.
Trump on the Olympics: "I thought that the opening ceremony was a disgrace, actually." pic.twitter.com/TMv7qYlf0G
— Aaron Rupar (@atrupar) July 30, 2024
ట్రంప్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైతే.. 2028లో లాస్ ఏంజిల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌ను ఎలా నిర్వహిస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో ప్రారంభోత్సంలోని ‘లాస్ట్ సప్పర్’ వంటి కార్యక్రమాన్ని మాత్రం చేయమని అన్నారు. పారిస్ ప్రారంభోత్సవంలో లాస్ట్ సప్పర్‌ను గుర్తుచేసే విధంగా కనిపించిన నృత్యకారులు, డ్రాగ్ క్వీన్స్, డీజే భంగిమలలో కూడిన సన్నివేశాలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తాజాగా చేసిన ట్రంప్ చేసిన విమర్శలు చర్చనీయాంశంగా మారాయి.