అనవసర యుద్ధాలకు దూరం

Donald Trump Says US will stay away from ridiculous foreign wars that never end - Sakshi

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

వాషింగ్టన్‌: ఇకపై విదేశాల్లో జరిగే యుద్ధాలకు తమ బలగాలను పంపమని, అవన్నీ అంతులేని నిరర్థక యుద్ధాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఇప్పటికే పలు దేశాల్లో ఉన్న తమ సైనికులను వెనక్కు రప్పిస్తామన్నారు. కేవలం తమ దేశానికి ప్రమాదమైన టెర్రరిస్టులను మట్టుపెట్టేందుకు మాత్రమే ఈ సైన్యాన్ని ఉపయోగిస్తామన్నారు. ఫ్లోరిడాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ దశాబ్దాలుగా అమెరికా రాజకీయవేత్తలు విదేశాల పునర్‌నిర్మాణం, విదేశీయుద్ధాల్లో పోరాడటం, విదేశీ సరిహద్దులను కాపాడడం వంటి పనులపై లక్షల కోట్ల డాలర్లు వెచ్చించారన్నారు. కానీ ప్రస్తుతం అమెరికా సేనలు అమెరికాను, అమెరికా నగరాలను రక్షించేందుకు పరిమితమవుతున్నాయని, అమెరికా బలగాలు స్వదేశాలకు వస్తున్నాయని చెప్పారు.

విదేశాల్లో జరిగే అనవసర యుద్ధాలకు సైన్యం వెళ్లదని, కానీ దేశానికి ముప్పుగా భావించే ఉగ్రవాదులను మాత్రం వదిలిపెట్టదని చెప్పారు. తమకున్నంత సైనిక సంపత్తి ఎవరికీ లేదని, బలం చూపించే శాంతిని పరిరక్షిస్తామని వివరించారు. ఈ ర్యాలీకి జనం భారీగా హాజరయ్యారు. కరోనా నిబంధనలను పక్కనబెట్టిమరీ జనం హాజరుకావడం ట్రంప్‌నకు మంచి ఉత్సాహాన్నిచ్చింది. డెమొక్రాట్లు అధికారంలోకి వస్తే పన్నులు పెంచుతారని, ఆయుధాల హక్కును రద్దు చేస్తారని, ఆ పార్టీ నిండా వామపక్షవాదులున్నారని దుయ్యబట్టారు. క్యూబా, వెనుజులా విధానాలను డెమొక్రాట్లు అమలు చేస్తారని విమర్శించారు. డెమొక్రాట్‌ నాయకురాలు కమలా హారిస్‌పై నేరుగా విమర్శలు చేశారు. కరోనా సంక్షోభం నుంచి అమెరికా ఎకానమీని తొందరగా బయటకు రప్పించామని చెప్పుకున్నారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top