
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండవ దఫా అధికారం చేపట్టినది మొదలు తన పాలనలో వినూత్న మార్పులు తీసుకువస్తున్నారు. తాజాగా వెనిజులా నుండి మాదకద్రవ్యాలను తీసుకువెళుతున్నట్లు భావిస్తున్న పడవను లక్ష్యంగా చేసుకుని, అమెరికా సైన్యం దాడి చేసిందని అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఆ నౌకలో ముగ్గురు మృతిచెందారని, ఈ తరహా‘కార్టెల్స్’ను లక్ష్యంగా చేసుకుని సైనిక దాడులు మరింతగా విస్తరిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
ఉగ్రవాదులు అంతర్జాతీయ జలాల్లో అక్రమ మాదకద్రవ్యాలను రవాణా చేస్తున్నప్పుడు ఈ దాడి జరిగిందని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో పేర్కొన్నారు. చట్టవిరుద్ధమైన వ్యాపార కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ఏర్పడిన ‘కార్టెల్స్’ అమెరికా జాతీయ భద్రత, విదేశాంగ విధానం, కీలకమైన అమెరికా ప్రయోజనాలకు ముప్పు కలిగిస్తున్నాయన్నారు. ఇటీవల అమెరికా సైన్యం వెనిజులా నుండి మాదకద్రవ్యాలను తీసుకువెళుతున్న స్పీడ్‌బోట్‌పై దాడి చేసింది. ఈ ఘటనలో 11 మంది మృతిచెందారు. తాజాగా ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ తమ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ తాజా ‘కార్టెల్స్’ దాడికి సంబంధించిన ఫుటేజ్ చూపించినట్లు తెలిపారు.
ఆ నౌకలో మాదకద్రవ్యాలున్నాయని అమెరికా దగ్గర ఎలాంటి రుజువు ఉందని విలేకరులు అడగగా ట్రంప్ ‘మా దగ్గర రుజువు ఉంది. మీరు చేయాల్సిందల్లా సముద్రం అంతటా చెల్లాచెదురుగా ఉన్న సరుకును గమనించడమే.. పెద్ద సంచుల కొకైన్, ఫెంటానిల్ అక్రమ రవాణా జరుగుతోంది. సముద్రంలో మాదకద్రవ్యాల స్మగ్లర్లపై ఎలా దాడులు జరుగుతున్నాయో అవి భూభాగంపైన కూడా కొనసాగుతాయని ట్రంప్ పేర్కొన్నారు.