వెనిజులా అధ్యక్షురాలి సంచలన నిర్ణయం | Delcy Rodriguez replaces Venezuela Defence Minister Vladimir Padrino | Sakshi
Sakshi News home page

వెనిజులా అధ్యక్షురాలి సంచలన నిర్ణయం

Mar 19 2026 3:55 AM | Updated on Mar 19 2026 11:18 AM

Delcy Rodriguez replaces Venezuela Defence Minister Vladimir Padrino

వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. 11 ఏళ్ల పాటు రక్షణ మంత్రిగా పని చేసిన జనరల్ వ్లాదిమిర్ పడ్రినోను పదవి నుంచి తప్పించింది. అతడి స్థానంలో జనరల్ గుస్తావో గోంజాలెజ్ లోపెజ్‌ను నియమించింది.

2014 నుంచి రక్షణ మంత్రిగా ఉన్న పడ్రినో మాజీ అధ్యక్షుడు నికోలస్‌ మదురోకు అత్యంత సన్నిహితుడు. ఈ మార్పు వెనిజులా రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. మాజీ అధ్యక్షుడు మదురో ముద్రను క్రమంగా తొలగించే ప్రయత్నంగా భావించబడుతోంది. రోడ్రిగెస్ ప్రభుత్వం సంస్కరణల దిశగా అడుగులు వేస్తున్న సంకేతంగా పరిగణించబడుతోంది.

పడ్రినోపై అవినీతి ఆరోపణలతో పాటు, నిరసనకారులపై హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని అభియోగాలు ఉన్నాయి. అయినా రోడ్రిగెస్ పడ్రినోను దేశానికి విశ్వాసపాత్రుడైన సైనికుడిగా అభివర్ణిస్తూ, త్వరలో కొత్త బాధ్యతలు అప్పగిస్తామని తెలపడం కొసమెరుపు.  

కొత్త రక్షణ మంత్రి గుస్తావో గోంజాలెజ్ లోపెజ్ విషయానికొస్తే.. ఇతను గతంలో వెనిజులా ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేశారు. ఇటీవల అతను ప్రభుత్వ చమురు సంస్థ PDVSAలో కీలక పాత్ర పోషించారు. ఇతనిపై కూడా మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు ఉన్నాయి.  

కాగా, ఈ ఏడాది జనవరి 3న అమెరికా సైనిక దాడి చేసి మదురో, అతని భార్య సిలియా ఫ్లోరెస్‌ను చెరలోకి తీసుకుంది. ఆతర్వాత తాత్కాలిక అధ్యక్షురాలిగా  డెల్సీ రోడ్రిగెస్‌ను నియమించింది. తదనంతరం మదురో ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు ఒక్కొరిగా రాజీనామాలు చేశారు. రోడ్రిగెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక వందలాది రాజకీయ ఖైదీలను విడుదల చేసి, సాధారణ అమ్నెస్టీ చట్టాన్ని ఆమోదించింది.

ట్రంప్‌ ఒత్తిడి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వెనిజులా చమురు మరియు గనుల రంగాన్ని విదేశీ పెట్టుబడులకు తెరవాలని ఒత్తిడి చేస్తున్నారు. అమెరికా ఇప్పటికే వెనిజులా చమురు విక్రయాలపై నియంత్రణ సాధించిందని ట్రంప్ ప్రకటించారు. కారాకాస్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఏడు సంవత్సరాల విరామం తర్వాత ఇటీవలే మళ్లీ ప్రారంభమైంది.  

 

Advertisement
 
Advertisement
Advertisement