వ్యాక్సిన్‌ వేసుకున్నా పరిగణనలోకి తీసుకోరు 

Covid Vaccination Should Not Be Considered At UK - Sakshi

భారతీయులకు బ్రిటన్‌లో 10 రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి 

పలు దేశాల ప్రయాణికులపై యూకే ఆంక్షలు 

లండన్‌: భారత్‌ సహాకొన్ని దేశాల వారు కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నా సరే వ్యాక్సినేషన్‌ అయినట్లుగా పరిగణించబోమని యూకే తెలిపింది. తమ దేశానికి వచ్చే ఆయా దేశాల వారు 10 రోజుల క్వారంటైన్‌ తప్పనిసరిగా పాటించాలంటూ యూకే కొత్త ప్రయాణ నిబంధనలను తీసుకువచ్చింది. ఆఫ్రికా, దక్షిణ అమెరికా ప్రాంత దేశాలతోపాటు యూఏఈ, భారత్, టర్కీ, జోర్డాన్, థాయ్‌లాండ్, రష్యాకు చెందిన వారు తమ దేశాల్లో వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లయితే, వారిని టీకా తీసుకున్నట్లుగా పరిగణించట్లేదని తెలిపింది.

ఈ దేశాల వారు క్వారంటైన్‌ నిబంధనలను పాటించాల్సి ఉంటుందని తెలిపింది. ఇప్పటి వరకు దేశాలను మూడు కేటగిరీ(గ్రీన్, అంబర్, రెడ్‌)లుగా విభజించి యూకే ప్రయాణ నిబంధనలను అమలు చేస్తోంది. ఇందులో భారత్‌ అంబర్‌ కేటగిరీలో ఉంది. తాజా, నిబంధనల ప్రకారం కేవలం ఒకే కేటగిరీ–రెడ్‌ మాత్రమే ఉంది. ఈ నిబంధనలు అక్టోబర్‌ 4వ తేదీ ఉదయం 4 గంటల నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. మిగతా దేశాలకు మాత్రం ప్రయాణ ఆంక్షలను సడలిస్తున్నట్లు యూకే ప్రభుత్వం తెలిపింది. 

ఇది జాతి వివక్షే: కాంగ్రెస్‌ 
కోవిషీల్డ్‌ టీకా వేసుకున్న భారతీయ ప్రయాణికులకు యూకే ప్రభుత్వం క్వారంటైన్‌ ఆంక్షలు విధించడం జాతి వివక్షేనని కేంద్ర మాజీ మంత్రులు జైరాం రమేశ్, శశిథరూర్‌ పేర్కొన్నారు. ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ తయారు చేసిన టీకానే సీరం ఇన్‌స్టిట్యూట్‌ కోవిషీల్డ్‌గా ఉత్పత్తి చేస్తోందని, దీనినే దేశవ్యాప్త వ్యాక్సినేషన్‌లో వాడుతున్న విషయాన్ని జైరాం రమేశ్‌ గుర్తు చేశారు. యూకే నిబంధనల కారణంగా కేంబ్రిడ్జి యూనియన్‌ డిబేటింగ్‌ సొసైటీ చర్చా కార్యక్రమంతోపాటు తన పుస్తకం ‘ది బ్యాటిల్‌ ఆఫ్‌ బిలాంగింగ్‌’యూకే ఎడిషన్‌ ఆవిష్కరణ కార్యక్రమం నుంచి వైదొలిగానని థరూర్‌ చెప్పారు.

యూకే వెళ్లాల్సిన భారతీయులు.. 
ప్రయాణానికి మూడు రోజుల ముందుగా కోవిడ్‌–19 పరీక్ష చేయించుకోవాలి. 
అక్కడికి చేరుకున్న 2వ, 8వ రోజున జరిపే కోవిడ్‌ పరీక్షలకు ముందుగానే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 
ఇంగ్లండ్‌ చేరుకునేందుకు 48 గంటల ముందుగా ప్యాసింజర్‌ లొకేటర్‌ ఫాంను పూర్తి చేయాలి. 

ఇంగ్లండ్‌ చేరుకున్న తర్వాత చేయాల్సినవి.. 
ఇంట్లో గానీ, 10 రోజులపాటు మీరు ఉండాల్సిన ప్రాంతంలో గానీ క్వారంటైన్‌ పాటించాలి. 
2వ రోజు ముందు, 8వ రోజుగానీ, ఆ     తర్వాత గానీ కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకోవాలి. 
యూకేలో రెండు డోసుల టీకా వేయించుకున్న వారు అక్కడి నుంచి బయలుదేరే ముందు టెస్ట్‌ చేయించుకోవాల్సిన పనిలేదు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top