భారత ప్రయాణికులపై ఆంక్షలు సడలించిన యూకే

COVID-19: UK eases rules for fully vaccinated Indian travelers - Sakshi

లండన్‌: భారత ప్రయాణికులపై ఉన్న ఆంక్షల్ని యూకే సడలించింది. ఇన్నాళ్లూ రెడ్‌ జాబితాలో ఉన్న మన దేశాన్ని అంబర్‌ లిస్టులోకి ఆదివారం నుంచి మార్చింది. అంటే వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న భారతీయ ప్రయాణికులు బ్రిటన్‌ హోటల్స్‌లో 10 రోజుల క్వారంటైన్‌ ఉండాల్సిన అవసరం లేదు. పది రోజుల హోంక్వారంటైన్‌ ఉంటే సరిపోతుందని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ సోషల్‌ కేర్‌ (డీహెచ్‌ఎస్‌సీ) వెల్లడించింది.  ఇన్నాళ్లూ బ్రిటన్‌ వెళితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ సెంటర్లలో 1,750 పౌండ్లు (దాదాపు రూ. 1.80 లక్షలు) ఖర్చు చేసి ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ నిబంధనని తొలగించి హోంక్వారంటైన్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.  

ఏమిటీ అంబర్‌ లిస్ట్‌..?  
ఇతర దేశాల్లో కరోనా తీవ్రత ఆధారంగా యూకే ప్రభుత్వం సిగ్నల్‌ లైట్స్‌లో ఉండే రంగులతో రెడ్, అంబర్, గ్రీన్‌ అనే మూడు జాబితాలుగా దేశాలను విభజించింది. నిరంతరం ఆయా దేశాల్లో కరోనా తీరుతెన్నుల్ని పర్యవేక్షిస్తూ మూడు వారాలకు ఒకసారి జాబితాల్లో మార్పులు చేస్తుంది. అంబర్‌ జాబితాలో ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కచ్చితంగా మూడుసార్లు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. బ్రిటన్‌కు వెళ్లడానికి మూడు రోజుల ముందు ఒకసారి, ఆ దేశానికి చేరిన రోజు లేదంటే రెండు రోజుల్లో మరోసారి, మళ్లీ ఎనిమిది రోజుల తర్వాత మూడో పరీక్ష చేయించుకోవాలి.

భారత్‌లో ఉన్న బ్రిటన్‌ పౌరులు పూర్తిగా వ్యాక్సినేట్‌ అయితే క్వారంటైన్‌లో ఉండాల్సిన పని లేదు.  అయితే స్వదేశానికి వెళ్లిన రెండు రోజుల్లోగా కోవిడ్‌ పరీక్ష చేయించుకోవాలి. ఇన్నాళ్లూ భారత్‌లో కరోనా రెండో వేవ్‌ తీవ్రంగా ఉండడంతో రెడ్‌ లిస్ట్‌లో ఉంది. దీంతో ఇక్కడ నుంచి యూకేకి ఎవరూ ప్రయాణించలేకపోయారు. ఇప్పుడు కేసులు కాస్త తగ్గుముఖం పట్టి వ్యాక్సినేషన్‌ పెరగడంతో అంబర్‌ లిస్టులోకి మార్చాలని గత బుధవారమే నిర్ణయించింది. ఆదివారం నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top