ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టే ముందు.. ఏం దుస్తులు వేసుకోవాలి? అనే ఆత్రుత సహజమే!. కళ్లకు అద్దుకునే కాటుక దగ్గరి నుంచి కాలికి వేసుకుని చెప్పుదాకా.. అన్నీ పక్కాగా ఉండాలని మహిళల్లో కొందరు అనుకుంటారు. కానీ, వాళ్లు ఏం వేసుకోవాలి? ఎలా ఉండాలి?.. ఇలా అన్నింటినీ ప్రభుత్వం నిర్ణయించే పరిస్థితి ఊహించగలరా?.. ఇప్పుడు ఆ దేశంలో అదే జరుగుతోంది. కాదంటే.. బలవంతంగా బేడీలు వేసి జైలుకు పంపిస్తున్నారు..
మహిళలపై ఇప్పటికే ఎన్నో పరిమితులు అమలు చేస్తున్న అఫ్గనిస్థాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం తాజాగా మరోసారి కఠిన చర్యలకు దిగింది. ముఖం పూర్తిగా కప్పుకోకుండా బయటకు రావడంపై నిషేధం విధించింది. అలాగే.. బిగుతైన దుస్తులు ధరించడం, మేకప్ వేసుకోవడం నేరమని ప్రకటించింది. తాము నిర్దేశించిన రీతిలో హిజాబ్ నిబంధనలు పాటించకపోతే కఠిన పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఈ క్రమంలో.. పలువురిని అదుపులోకి తీసుకుని నిర్బంధ కేంద్రాలకు తరలించే అధికారం పోలీసులకు సైతం కల్పించారు.
మహిళలు మాత్రమే కాదు.. వారి కుటుంబ సభ్యులపైనా బాధ్యత మోపారు. ఇంట్లోని మహిళలు నిబంధనలు పాటించేలా చూడాల్సిన బాధ్యత ఆ ఇంట్లోని మగవాళ్లదేనని స్పష్టం చేసింది తాలిబాన్ ప్రభుత్వం. ఉల్లంఘనలు కొనసాగితే పురుషుల మీద కూడా కేసులు నమోదు చేసి న్యాయపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని హెరాత్ ప్రావిన్స్‌లో ప్రస్తుతం ఈ ఆదేశాలు అమలవుతున్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.
ఇక.. కొత్త నిబంధనల అమలులో భాగంగా హెరాత్‌లోని పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు సమాచారం. రహదారులపై వెళ్తున్న వాహనాలు, ట్యాక్సీలను ఆపి మహిళల దుస్తులు, హిజాబ్ విధానాన్ని తనిఖీ చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే కనీసం 21 మంది మహిళలు, బాలికలను ఈ నిబంధనల ఉల్లంఘన పేరుతో అదుపులోకి తీసుకున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.
అరెస్టైన వారిలో ఓ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న నర్సు కూడా ఉన్నట్లు సమాచారం. భర్తతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారని స్థానిక వర్గాలు వెల్లడించాయి. ఇదే సమయంలో గడ్డం నిబంధనలు పాటించలేదనే కారణంతో కొందరు వైద్యులు, నర్సులను కూడా తాలిబాన్ అధికారులు హెచ్చరించినట్లు తెలుస్తోంది.
2021లో తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాలిబాన్ ప్రభుత్వం మహిళలపై వరుస ఆంక్షలు విధిస్తోంది. బాలికల ఉన్నత విద్యపై నిషేధం, ఉద్యోగ అవకాశాల పరిమితి, ప్రజా ప్రదేశాల్లో సంచారంపై ఆంక్షలు వంటి వందకు పైగా ఆదేశాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. తాజాగా వచ్చిన ఈ నిర్ణయాలు మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను మరింత కుదించే చర్యలుగా అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు విమర్శిస్తున్నాయి.


