
బోట్స్‌వానాలో 2020లో ఏనుగుల మూకు మ్మడి మరణం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒకేసారి ఏకంగా 350 ఏనుగులు అనుమానాస్పద స్థితిలో మరణించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమ య్యాయి. ఈ ఉదంతంపై లండన్‌లోని కింగ్స్ కాలేజీ పరిశోధనలు జరిపింది.
ఆ ఏనుగుల మరణాల వెనుక మిస్టరీ నాలుగేళ్లకు వీడింది. అడవిలోని నీటి గుంతలు కలుషితమవడమే ఏనుగుల మృతికి కారణమని అధ్యయన బృందం తెలిపింది. ‘‘సైనో బ్యాక్టీరియా విడుదల చేసిన సైనో టాక్సిన్లు నీటిపై విషపూరిత నురగకు కారణమయ్యాయి. అదే ఏనుగుల మరణానికి దారి తీసింది’’ అని వెల్లడించింది.
వర్షాధారిత గుంతల వల్లే.
ఒకవాంగో డెల్టాలోని 6 వేల చదరపు కిలోమీట ర్ల పరిధిలో 20 నీటి గుంతలు కలుషితమైనట్టు అధ్యయనంలో తేలింది. ఆ నీటిని తాగాక 88 గంటల్లోనే ఏనుగులు చనిపోయినట్టు అంచనా వేసింది. అవి శాశ్వత నీటి వనరులు కావు. కేవ లం వర్షాధారిత గుంతలు. వాటివల్లే ప్రమాదం జరిగిందని అధ్యయన సారథి శాస్త్రవేత్త డేవిడే లోమియో చెప్పారు. చనిపోయిన ఏనుగులు వేర్వేరు వయసులవి. పైగా వాటి దంతాలు చెక్కుచెదరకుండా ఉన్నాయి. కనుక వాటిని వేటాడారన్న వాదన సరికాదు’’ అని తెలిపారు.
ఆల్గే పెరుగుదలకు కారణం?
సైనో బాక్టీరియాగా పిలిచే నీలం–ఆకుపచ్చ ఆల్గే లో అన్నిరకాలూ విషపూరితం కావు. కొన్నిరకాల సైనోబాక్టీరియా నిలకడగా ఉన్న నీటిలో ఒక రకమైన ప్రాణాంతక ఆల్గల్ బ్లూమ్స్ (హెచ్‌ఎబి) ను ఉత్పత్తి చేస్తుంది. బోట్స్‌వానాలో 2019లో అస్సలు వానల్లేవు. 2020లోనేమో విపరీతంగా వానలు పడ్డాయి. ‘‘అధిక వర్షపాతంతో భూమి నుంచి భారీ అవక్షేపాలతో పాటు పోషకాల పునరుత్పత్తి విపరీతంగా జరిగింది. అదే ఆల్గల్ పెరుగుదలకు కారణమైంది’’ అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
వాతావరణ మార్పుల వల్ల భవిష్యత్తులో ఇలాంటివి తరచూ జరగవచ్చని హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల అతివృష్టి, అనావృష్టితో ఆఫ్రికా దక్షిణ భాగం వైరుధ్య వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటోందని వారంటున్నారు. ‘‘ఇదే నీటిపై ప్రభా వం చూపుతోంది. దాంతో జంతువులు విపత్కర పరిణామాలను ఎదుర్కొంటున్నాయి’’ అని తెలిపారు. అడవులు, పార్కుల్లోని నీటి వనరుల నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం చాలా అవసరమన్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్