
బీజింగ్: చైనాను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వరదల కారణంగా ఇప్పటివరకూ 34 మంది మృతిచెందారు. బీజింగ్‌లో 80 వేలమందికిపైగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. బీజింగ్‌లోని మియున్ జిల్లాలో వరదల కారణంగా 28 మంది మృతి చెందారని, యాంకింగ్ జిల్లాలో ఇద్దరు మృతిచెందారని రాష్ట్ర ప్రసార సంస్థ సీసీటీవీ తెలిపింది.
చైనా ప్రీమియర్ లీ కియాంగ్ మీడియాతో మాట్లాడుతూ మియున్‌లో కురిసిన భారీ వర్షాలు, వరదలు తీవ్రమైన ప్రాణనష్టం కలిగించాయని అన్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు. కాగా ఆకస్మిక వరదల్లో మృతి చెందినవారి సంఖ్య 34కు చేరిందని చైనా రాష్ట్ర మీడియా నివేదించింది. బీజింగ్‌లో 80 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మియున్‌లో దాదాపు 17 వేల మంది ముంపు బారినపడ్డారని సమాచారం.
🇨🇳中国の国営メディアによると、北京と近隣地域で大雨と洪水により30人以上が死亡し、数万人以上が首都から避難した。https://t.co/E1o1IachDH pic.twitter.com/GJxbcB8W5I
— カントリーママ (@0327tnumata) July 29, 2025
హెబీ ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిపడటంతో నలుగురు మరణించారని, మరో ఎనిమిది మంది గల్లంతయ్యారని సమాచారం. లువాన్‌పింగ్ కౌంటీలోని గ్రామీణ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. మియున్ జిల్లాలోని ఒక జలాశయం నుండి అధికారులు నీటిని విడుదల చేశారు. నదుల్లోని నీటి మట్టాలు పెరుగుతుండటంతో ప్రజలు వాటికి దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మియున్‌లో సంభవించిన భారీ వరదలకు కార్లు కొట్టుకుపోయాయి.
సెంట్రల్ బీజింగ్‌కు ఈశాన్యంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న తైషిటున్ పట్టణంలో వందలాది చెట్లు నేల కూలాయి. బీజింగ్ పరిపాలన అధికారులు ఉన్నత స్థాయి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, సహాయక చర్యలు ముమ్మరం చేశారు. భారీ వర్షాలు కురుస్తున్నందును ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. పాఠశాలలను మూసివేశారు. నిర్మాణ పనులను నిలిపివేశారు. పర్యాటక రంగ కార్యకలాపాలు నిలిచిపోయాయి.