కొత్త అధ్యక్షుడు రాగానే.. పెద్ద డాక్టర్‌ మారిపోయాడు

Biden Nominates Dr Vivek Murthy As Surgeon General Of Us - Sakshi

ఏ పాలనా వ్యవస్థలోనైనా ప్రధానంగా ఇద్దరే ఉంటారు. ఆదేశాలు ఇచ్చేవారు. ఆదేశాలు పాటించేవారు. ఇండియా కానివ్వండి. అమెరికా అవనీయండి. రాజకీయ నాయకులు ఆదేశిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు పాటిస్తారు. ఆదేశించేవారు ఇండియాలో అయితే ఐదేళ్లు, అమెరికాలో అయితే నాలుగేళ్లు ఉంటారు. ఆ తర్వాత మారిపోతారు. ప్రజాభిమానం ఉంటే మరో టెర్మ్‌ మారకుండా ఉండిపోతారు. రిటైర్‌ అయ్యేవరకు ఉండేది మాత్రం ఆదేశాలు పాటించేవారే. కాకపోతే.. ఆదేశించేవారు మారినప్పుడల్లా ఆదేశాలు పాటించేవారి స్థానం మాత్రం మారుతుంటుంది.


భార్య, కుమార్తె తో జెరోమ్‌ ఆడమ్స్‌
జో బైడెన్‌ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయగానే,‘సర్జన్‌ జనరల్‌ ఆఫ్‌ యునైటెడ్‌ స్టేట్స్‌’ జెరోమ్‌ ఆడమ్స్‌ రాజీనామా చేశారు. చేయడం కాదు, బైడెన్‌ ఆయన్ని రాజీనామా చేయమని రిక్వెస్ట్‌ చేశారు! ట్రంప్‌ నియమించిన సర్జన్‌ జనరల్‌ ఆడమ్స్‌. ఆయన స్థానంలోకి డాక్టర్‌ వివేక్‌ మూర్తిని బైడెన్‌ నియమించుకున్నారు. పాలకుల నిర్ణయాలు ఎలా ఉన్నా, అధికారులు మాత్రం ఆ నిర్ణయాలకు అనుగుణంగా ఆదేశాలను అమలు చేయవలసి ఉంటుంది. ఇంతకీ ఆడమ్స్, మూర్తి.. ఇద్దరిలో ఎవరు సమర్థులు? ఇద్దరూ. అయితే బైడన్‌ మూర్తికి ఒక మార్కు ఎక్కువ వేసుకున్నారు.. తన పాలనా సౌలభ్యం కోసం.

జెరోమ్‌ ఆడమ్స్‌
సర్జన్‌ జనరల్‌ ఆఫీసు వాషింగ్టన్‌ డీసీలో ఉంటుంది. ఆమెరికా ప్రజారోగ్య సేవల పాలనా వ్యవహారాలన్నీ అక్కడినుంచే అమలు అవుతాయి. నిన్నటి వరకు ఆ ఆఫీసు మెట్లెక్కి దిగిన జెరోమ్‌ ఆడమ్స్‌ తన కెరీర్‌లో ఎన్నో నిచ్చెనలు ఎక్కి జనరల్‌ స్థాయికి చేరుకున్నారు. 46 ఏళ్లు ఆడమ్స్‌కి. ఆరోగ్యంగా ఉంటారు. తన శాఖనూ ఆరోగ్యంగా ఉంచారు. ప్రాథమికంగా ఆయన అనెస్థీషియాలజిస్టు. నేవీలో చేశారు. ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడు అయిన ఏడాది తర్వాత ఆయనకు సర్జన్‌ జనరల్‌ పదవి లభించింది. అంతకుముందు వరకు ఆడమ్స్‌ ఇండియానా స్టేట్‌ హెల్త్‌ కమిషనర్‌. కరోనా వచ్చి, గత ఏడాదిగా మనం తెల్లారి లేస్తే టీవీలలో, పేపర్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధాన మ్‌ని, ఆ సంస్థ తరఫునే పని చేస్తున్న సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ని, మన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్‌ని చూస్తూ వస్తున్నాం. వీళ్లలాగే అమెరికాలో జెరోమ్‌ ఆడమ్స్‌. వీళ్లలాగే అంటే కరోనా గురించి అమెరికా ఏం చెప్పాలనుకున్నా ఈయన స్క్రీన్‌ మీదకు వచ్చేవారు.


ట్రంప్‌తో ఆడమ్స్‌
భద్రంగా ఉండాలనీ, నిర్లక్ష్యం తగదని ఆడమ్స్‌ ఎప్పటికప్పుడు ప్రజల్ని హెచ్చరిస్తున్నప్పటికీ, కరోనాను ఏమాత్రం లెక్కచేయని ట్రంప్‌ ధీమా ముందు ఆ హెచ్చరికలన్నీ కొట్టుకుపోయాయి. రేపు ఒకవేళ ఏ ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ పత్రిక ప్రతినిధో.. ‘ఆడమ్స్‌ని రాజీనామా చేయమని ఎందుకు కోరవలసి వచ్చింది? అని బైడెన్‌ను అడిగినప్పుడు..‘కరోనాను కంట్రోల్‌ చేయలేకపోయారు’ అనేది ఆయన దగ్గర ఉండే తక్షణ సమాధానం కావచ్చు. అందువల్ల ఆడమ్స్‌కి వచ్చే నష్టం ఏమీ లేదు. ఆయన ఏంటో, తన కెరీర్‌లో ఆయన ఎన్ని అవార్డులు సాధించారో ఆ రంగంలోని వారందరికీ తెలుసు. ఆయనకొచ్చిన ఫీల్డ్‌ మెడికల్‌  రెడీనెస్‌ బ్యాడ్జిలు అయితే.. చదివితే అర్థం అయ్యేవి కావు. వంశవృక్షంలా ఒక మ్యాప్‌ గీసుకోవాలి. ఆడమ్స్‌ భార్య లేసీ. ఇద్దరు తనయులు. ఒక కుమార్తె. లేసీ స్కిన్‌ క్యాన్సర్‌ నుంచి రెండుసార్లు బయటపడ్డారు. 

వివేక్‌ మూర్తి 
అమెరికా సర్జన్‌ జనరల్‌గా ఉన్న జరోమ్‌ ఆడమ్స్‌ స్థానంలోకి బైడెన్‌ తీసుకున్న భారత సంతతి వైద్యుడు వివేక్‌ మూర్తి ఆడమ్స్‌ కన్నా వయసులో మూడేళ్లు చిన్న. 43 ఏళ్లు. ఈయన కూడా ఆయనలానే అమెరికన్‌ నేవీలో వైస్‌ అడ్మిరల్‌గా చేశారు. ‘డాక్టర్స్‌ ఫర్‌ అమెరికా’ అని పన్నెండేళ్ల క్రితం సొంతంగా ఒక సేవాసంస్థను స్థాపించారు. అమెరికా సర్జన్‌ జనరల్‌ అయిన తొలి భారత సంతతి వైద్యుడు కూడా. పూర్వికులది కర్ణాటక. ఈయన యు.కె.లో పుట్టారు. తర్వాత యు.ఎస్‌. వచ్చేశారు. మూర్తి ఇంటర్నల్‌ మెడిసిన్‌ డాక్టర్‌. హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్లో డిగ్రీ చేశారు. 2011లో ఒబామా ఈయన్ని ‘హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌’ డిపార్ట్‌మెంట్‌లోకి తీసుకున్నారు. ప్రజారోగ్యం కోసం పదిహేను వేల మంది వైద్యులతో, మెడికల్‌ స్టూడెంట్స్‌తో ‘డాక్టర్స్‌ ఫర్‌ అమెరికా’ సంస్థ ద్వారా మూర్తి నడిపిన సైన్యాన్ని చూసి ఈ వైద్య సేనాపతిని తనకు సహాయంగా తీసుకున్నారు ఒబామా. ఆయన ప్రభుత్వంలో మూర్తి కూడా కొంతకాలం సర్జన్‌ జనరల్‌గా ఉన్నారు.


బైడెన్‌తో మూర్తి 
అయితే అంత తేలిగ్గా ఏమీ సెనెట్‌ మూర్తి నియామకాన్ని ఆమోదించలేదు. డెమోక్రాట్లు, రిపబ్లికన్‌లు ఇద్దరూ వ్యతిరేకించారు. ‘అమెరికాలో గన్‌ వయలెన్స్‌ ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమించింది’ అని గతంలో మూర్తి చేసిన కామెంట్‌ వల్ల ఆయనకు కాంగ్రెస్‌ మద్దతు లభించలేదు. చివరికి యూఎస్‌లోని వందకు పైగా వైద్య, ప్రజారోగ్య సంస్థలు, మాజీ సర్జన్‌ జనరళ్లు ఇద్దరు ఆయన నియామకాన్ని సమర్థించడంతో సెనెట్‌లో ఆయనకు 51–43 ఓట్ల వ్యత్యాసంతో ఆమోదం లభించింది. ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడు అయ్యాక మూర్తి స్థానంలోకి ఆడమ్స్‌ని తీసుకున్నారు. ఆడమ్స్‌కి ఉన్నన్ని అవార్డులు మూర్తికి లేకపోయినా అంతటి అనుభవమైతే ఉంది. మూర్తి భార్య కూడా డాక్టరే. అసిస్టెంట్‌ క్లినికల్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఆమె పేరు అలైస చెన్‌. ఒక కొడుకు, ఒక కూతురు.                          

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top