
వార్సా: అనుమత లేకుండా తమ గగనతలంలోకి ప్రవేశించిన రష్యా డ్రోన్లను కూల్చివేసినట్లు పోలండ్ బుధవారం వెల్లడించింది. మంగళవారం రాత్రి కొన్ని గంటల వ్యవధిలో పెద్ద సంఖ్యలో రష్యా డ్రోన్లను నేలమట్టం చేశామని, ఇందుకు ‘నాటో’దేశాలు సైతం సహకరించాయని తెలియజేసింది. రష్యా తీరును దురాక్రమణ చర్యగానే పరిగణిస్తున్నట్లు స్పష్టంచేసింది. కొన్ని డ్రోన్లు రష్యా మిత్రదేశమైన బెలారస్ భూభాగం గుండా తమ గగనతలంలోకి వచ్చాయని పేర్కొంది. ‘‘గత రాత్రి రష్యా డ్రోన్లు మా గగనతలాన్ని ఉల్లంఘించాయి.
మాకు ముప్పుగా మారిన ఆ డ్రోన్లను కూల్చివేశాం’’అని పోలండ్ ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. డ్రోన్లతో దాడులు జరగొచ్చన్న అంచనాతో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం దాకా పోలండ్ సైన్యం అప్రమత్తంగా వ్యవహరించింది. పదికిపైగా డ్రోన్లు తమ గగనతలంలోకి ప్రవేశించినట్లు పోలండ్ రక్షణ శాఖ మంత్రి వ్లాదిస్లావ్ పేర్కొన్నారు.
తాజా పరిణామాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా వార్సా ఎయిర్‌పోర్టు నుంచి విమానాల రాకపోకలను కొన్ని గంటలపాటు నిలిపివేశారు. మరోవైపు ఉక్రెయిన్‌లోని పశ్చిమ ప్రాంతాలపై రష్యా సైన్యం డ్రోన్లతో దాడులకు దిగింది. ఈ దాడుల్లో ముగ్గురు మరణించారు. రష్యా–బెలారస్ ఉమ్మడిగా మిలటరీ డ్రిల్స్ నిర్వహిస్తున్నాయి. ఈ నెల 16వ తేదీ దాకా ఇవి కొనసాగుతాయి. అయితే, సాంకేతిక సమస్యల వల్ల కొన్ని డ్రోన్లు పోలండ్ గగనతలంలోకి ప్రవేశించాయని బెలారస్ సైన్యం వెల్లడించింది. అలా దారితప్పి వెళ్లిన డ్రోన్లనే పోలండ్ కూల్చివేసినట్లు స్పష్టంచేసింది.
పోలండ్‌ను టార్గెట్ చేయలేదు: రష్యా
తమ డ్రోన్లను పోలాండ్ కూల్చడంపై రష్యా రక్షణ శాఖ స్పందించింది. తమ టార్గెట్ పోలండ్ కాదని బుధవారం వివరణ ఇచి్చంది. ఉక్రెయిన్ పశి్చమ ప్రాంతంలోని సైనిక–పారిశ్రామిక కాంప్లెక్స్‌పై దాడి చేయడానికి డ్రోన్లను ప్రయోగించినట్లు తెలిపింది. పోలండ్ భూభాగంపై దాడి చేయాలన్న ఉద్దేశం ఎంతమాత్రం లేదని వివరణ ఇచి్చంది. డ్రోన్ల అంశంపై ఆ దేశ రక్షణ శాఖతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.