
థాయ్ ఎయిర్‌వేస్ విమానంలో థాయ్‌లాండ్‌కు చేరిక
హమీద్‌పై ఇప్పటికే హత్య కేసు నమోదు
ఆయన పరారీపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించిన ప్రభుత్వం
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ హమీద్(Mohammed Abdul Hamid)(81) ఎవరికీ చెప్పాపెట్టకుండా రహస్యంగా దేశం విడిచి వెళ్లిపోయారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో ఢాకా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి థాయ్ ఎయిర్‌వేస్ విమానంలో గుర్తుతెలియని ప్రాంతానికి చేరుకున్నారు. ఇంటి నుంచి చక్రాల కురీ్చలో వెళ్లే సమయంలో ఆయన ఒంటిపై లుంగీ మాత్రమే ఉండడం గమనార్హం. మాజీ అధ్యక్షుడు ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో ఉన్నట్లు భావిస్తున్నారు.
గత ఏడాది షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను బలవంతంగా అణచివేసిన కేసులో మొహమ్మద్ అబ్దుల్ హమీద్‌పై దర్యాప్తు జరుగుతోంది. ఆయనపై హత్య కేసు సైతం నమోదైంది. ఈ నేపథ్యంలో దేశం విడిచి వెళ్లిపోవడం ప్రాధాన్యం సంచలనాత్మకంగా మారింది. మొహమ్మద్ అబ్దుల్ హమీద్ వ్యవహారం పట్ల బంగ్లాదేశ్‌లోని మధ్యంతర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన పారిపోకుండా అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసు అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడం పట్ల మండిపడింది. కొందరు అధికారులను విధుల నుంచి సస్పెండ్ చేసింది.
మరికొందరికి బదిలీ వేటు వేసింది. మొహమ్మద్ అబ్దుల్ హమీద్ పరారీపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ సలహాదారు సి.ఆర్.అబ్రార్ నేతృత్వంలో దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు. హమీద్ 2013 నుంచి 2023 మధ్యలో రెండుసార్లు బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2024లో షేక్ హసీనాతోపాటు ఆమె అనుచరులపై నమోదైన హత్య కేసులో ఆయన సహ నిందితుడిగా ఉన్నారు. ఈ ఏడాది జనవరి 14న కిశోర్‌గంజ్ సదర్ పోలీసు స్టేషన్‌లో ఆయనపై హత్య కేసు నమోదైంది.
వైద్యం కోసమేనా?
కేవలం వైద్యం కోసమే హమీద్ థాయ్‌లాండ్ వెళ్లారని కుటుంబ సభ్యులు చెప్పారు. ఆయనతోపాటు సోదరుడు, బావమరిది కూడా వెళ్లినట్లు తెలిపారు. అయితే, దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికే దేశం నుంచి హమీద్ పరారైనట్లు రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పారీ్టలో హమీద్ చురుగ్గా వ్యవహరించారు. పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అవామీ లీగ్ విద్యార్థి విభాగమైన ఛాత్రా లీగ్ ద్వారా రాజకీయ జీవితం ప్రారంభించారు. ఛాత్రా లీగ్‌ను గత ఏడాది అక్టోబర్‌లో మధ్యంతర ప్రభుత్వం నిషేధించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన ఇంటిని ఇస్లామిక్ రాడికల్స్ కూల్చివేశారు.