7 Unbelievable Facts About Ants In Telugu: Did Ants Live With Dinosaurs - Sakshi
Sakshi News home page

Ants Facts In Telugu: డైనోసార్లకు చుట్టాలు చీమలు..వాటర్‌ ప్రూఫ్‌ కూడా!

Feb 28 2022 11:12 AM | Updated on Feb 28 2022 12:32 PM

Ants Also Give Feed To Other Organisms - Sakshi

ఏంటి.. నిజమా! అని అనుకొనే ఉంటారు. మనుషులు కాకుండా ఇంకే జీవులైనా ఇతర జీవులను పెంచి పోషిస్తున్నాయంటే అవి చీమలే. ఆహారం, ఇతర ఉత్పత్తుల కోసం..

‘చీమంత బలం నీది .. నువ్వేం చేస్తావ్‌ రా నన్ను’ అంటూ చీమను తక్కువ చేసి మాట్లాడుతుంటారు కానీ చీమకున్నంత బలం, చీమకున్నంత ఓర్పు, నేర్పు, కలుపుగోలుతనం.. అబ్బో చాలా వాటిల్లో మనుషులను మించి ముందున్నాయి. వీటికి సంబంధించి అవాక్కయ్యే నిజాలు కూడా చాలానే ఉన్నాయి. ఆ ‘చాలా’ ఏంటో తెలుసుకుందామా! 

డైనోసార్లకు చుట్టాలు చీమలు
నిజం. హార్వర్డ్, ఫ్లోరిడా స్టేట్‌ వర్సిటీల పరిశోధనలో ఇది తేలింది. 130 మిలియన్‌ సంవత్సరాల కిందటి నుంచే చీమలు ఉన్నాయంట. డైనోసార్లు అంతరించినా ఇవి మాత్రం గడ్డు పరిస్థితులను తట్టుకొని నిలబడ్డాయంట.

చీమలు.. రైతులు 
ఏంటి.. నిజమా! అని అనుకొనే ఉంటారు. మనుషులు కాకుండా ఇంకే జీవులైనా ఇతర జీవులను పెంచి పోషిస్తున్నాయంటే అవి చీమలే. ఆహారం, ఇతర ఉత్పత్తుల కోసం ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్లను మనుషులు పెంచుతున్నట్టే.. చీమలు కూడా కొన్ని రకాల నల్లులను పెంచి పోషిస్తాయి. ఇతర జీవుల నుంచి రక్షణ కల్పిస్తాయి. వానాకాలంలో ఇబ్బంది పడకుండా వాటి ఇళ్లల్లో చోటిస్తాయి. బదులుగా ఆ నల్లుల నుంచి తేనెను తీసుకుంటాయి. అలాగే ఆహారానికి, నివాసానికి కావాల్సిన మంచి ప్రాంతమెక్కడుందో తెలుసుకోవడానికి తమ తోటి చీమలందరి నుంచి సలహాలను తీసుకొని మరీ చీమలు ముందుకెళ్తాయి.   

పాఠాలు నేర్పించగలవు 
మనుషులు, జంతువుల్లా చీమలు కూడా తమ తోటి చీమలకు పాఠాలు చెప్పగలవు. నేర్పించగలవు. చాలా జంతువులు తమ తోటి జంతువులను అనుసరించి కావాల్సినవి నేర్చుకుంటుంటాయి. కానీ చీమలు కాస్త వేరు. కొన్ని రకాల రసాయనాలను బయటకు విడుదల చేసి పక్క చీమలకు కొన్ని రకాల విషయాలు నేర్పిస్తుంటాయి. ఉదాహరణకు కొత్త ప్రాంతానికి, ఇంటికి గనుక చీమలు వెళ్తే పక్క చీమలు ఆ ప్రాంతాన్ని గుర్తుంచుకోవడానికి వీలుగా రసాయనాలు వదులుతుంటాయి. ప్రతి కొంత దూరానికి ఇలా చేస్తుంటాయి. మిగతా చీమలు ఆ వాసన పసిగట్టి ముందుకెళ్తుంటాయి. చీమలు ఒకే వరుసలో వెళ్లడానికి ప్రధాన కారణమిదే. చీమలు పనికెక్కాయంటే పక్కా మరి.  

ఇవి వాటర్‌ ప్రూఫ్‌
చీమలు నీటిలో ఈదగలవు. అలాగని బటర్‌ఫ్లై స్టైల్లో ఈతకొడతాయని కాదు. వాటిస్థాయిలో నీటిపై తేలుతూ వెళ్తుంటాయి. ఒకవేళ నీటి అడుగుకు వెళ్లినా కూడా బతకగలవు. ఎలాగా..? అంటే వాటికి ఊపిరితిత్తులుండవు మరి. వాటి శరీరంపై ఉండే రంధ్రాలతో ఆక్సిజన్‌ పీల్చుకోవడం, కార్బన్‌డై ఆౖMð్సడ్‌ను వదలడం చేస్తుంటాయి. రంధ్రాలు చిన్న చిన్న గొట్టాలకు కలిపి ఉంటాయి. వీటి నుంచి శరీరంలోని ఇతర ప్రాంతాలకు ఆక్సిజన్‌ సరఫరా అవుతుంది. కాబట్టి చీమలు నీటి అడుగుకు వెళ్లినా 24 గంటల్లోపు నీళ్లు ఆవిరైతే అవి మళ్లీ బతికేయగలవు. కొన్ని శరీర భాగాలు పోయినా కొన్ని చీమలు జీవిస్తాయి. కొన్ని తిండి, నీళ్లు లేకున్నా వారాల తరబడి బతికేస్తాయి. చీమలకు చెవులు కూడా ఉండవు. అలాగని వినలేవని కాదు. వైబ్రేషన్స్‌ ద్వారా ఇవి వినగలుగుతాయి.  

రెండు పొట్టల జీవులు 
చీమలకు రెండు పొట్టలుంటాయి. అలాగని ఇవేం అత్యాశపరులేం కాదు. ఒక పొట్టలో తమకు కావాల్సిన ఆహారం పెట్టుకుంటాయి. మరో పొట్టలో వేరే చీమలకు కావాల్సిన ఆహారం నిల్వ చేసుకుంటాయి. కొన్ని చీమలు తమ గూడు వదిలి ఆహారం కోసం వెళ్లినప్పుడు తమ ప్రాంతానికి కాపలాగా ఉంటాయి. ఇలా బయటకు వెళ్లిన చీమలు కాపలాగా ఉండే చీమలకు ఆ రెండో పొట్టలో 
తిండి దాచుకొని తీసుకొస్తాయి.     

చాలా.. అంటే చాలానే..  
ప్రపంచంలో చీమల జనాభా ఎంతనుకుంటున్నారు. చాలానే ఉంటుంది. చాలా అనే పదం వాడినా తక్కువేనేమో. ఎందుకంటే ప్రపంచంలోని ప్రతి మనిషికి సరాసరి 10 లక్షల చీమలున్నాయి. చీమల్లో దాదాపు 10 వేల రకాలు ఉన్నాయి.

బలంలో బాహుబలులు  
చీమలు బలంలో బాహుబలులు. వీటి శరీర బరువుకు దాదాపు 10 నుంచి 50 రెట్ల వరకు బరువును మోసుకెళ్లగలవు. చీమల పరిమాణంతో, బలంతో పోల్చితే ప్రపంచంలో అత్యంత బలమైన జీవులివే. ఆసియా జాతికి చెందిన చీమలైతే తమ బరువుకు దాదాపు 100 రెట్లు బరువును తీసుకెళ్లగలవు. అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ రిపోర్టు ప్రకారం.. చీమలు చిన్నగా ఉంటాయి కాబట్టి వాటి కండరాల్లో విభజన ఎక్కువుంటుంది. దాని వల్ల మిగతా జీవులతో పోల్చితే ఎక్కువ బలాన్ని ప్రయోగించగలవు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement