వివాహిత ఆత్మహత్య
పటాన్‌చెరు టౌన్ (హైదరాబాద్): చీమల ఫోబియాతో ఒక వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శర్వా హోమ్స్‌కు చెందిన శ్రీకాంత్ భార్య మనీషా (25) చీమల ఫోబియాతో బాధపడుతోంది. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చూపించారు.
ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం భర్త డ్యూటీకి వెళ్లి ఇంటికి వచ్చేసరికి పడక గది తలుపు మూసి ఉంది. స్థానికుల సహకారంతో లోపలికి వెళ్లి చూడగా.. మనీషా చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని శవమై కనిపించింది. ‘ఈ చీమల ఫోబియాతో బతకడం నా వల్ల కావట్లేదు.. కూతురు అని్వ(4) జాగ్రత్త‘అని ఆమె రాసి ఉంచిన లేఖ ఉంది. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


