ఒక అమెరికన్ జంట భారతదేశంలో 30 రోజుల పాటు 13 నగరాలను సందర్శించా మంటూ ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ చేసి వైరల్‌గా మారారు. ఈ టూర్ కోసం ఈ జంట ఏకంగా 10,605 డాలర్లు (దాదాపు రూ. 10 లక్షలు) ఖర్చు చేసినట్లు సోషల్ మీడియాలో వెల్లడించడంతో ఈ విషయం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
ట్రావెలర్స్ అలెక్స్, అమేలియా తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఖర్చుల వివరాలను పంచు కున్నారు. అయితే ఖర్చు తాము అనుకున్నదానికంటే ఎక్కువే అయిందని అంగీకరించారు. తాము లగ్జరీ హోటళ్లు, ప్రీమియం అనుభూతులకు ప్రాధాన్యత ఇవ్వడమే ఈ భారీ ఖర్చుకు కారణమని వారు పేర్కొన్నారు.
మొత్తంగా ఇండియాలో నెల రోజుల కోసం రూ. 10 లక్షలు అంటే, రోజు రూ. 33,627 అన్నమాట అని ఆ జంట రాసుకొచ్చింది. 30 రోజుల్లోనే 13 నగరాలను సందర్శించడం వల్ల తమ ట్రిప్‌లోట్రాన్స్‌పోర్ట్ కోసమే అత్యధికంగా ఖర్చయిందని వారు తెలిపారు. తమ భారత పర్యటనలో భాగంగా ఆరు విమానాలు, ఆరు ప్రైవేట్ కార్ ప్రయాణాలు, రెండు రైలు ప్రయాణాలు చేసినట్లు వారు తెలిపారు. ప్రీమియం హోటళ్ల ధరలు ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఖర్చు పెరిగిందని, రోజుకు సగటున హోటల్ రూమ్ కోసం రూ. 12,064 ఖర్చు చేసినట్లు చెప్పారు.
మొత్తం లెక్కలు వేసి, ఒక నెలలో ఇంత ఖర్చు చేశామా అనే తామే ఆశ్చర్యపోయామని వెల్లడించారు. కేవలం బడ్జెట్ ఎంపికల కోసం మాత్రమే చూడకపోతే, ఇతర ప్రయాణికులు చెప్పినంత చౌకగా వసతి లేదన్నారు. అల్పాహారం, మధ్యాహ్నభోజనం, రాత్రి భోజనం బయట తినడంతో జేబులు ఖాళీ అయ్యాయని చెప్పుకొచ్చారు.
వామ్మో..ఇది నిజంగానే ఎక్కువ : సోషల్ మీడియా స్పందన
ఈ పోస్ట్ వైరల్ కావడంతో, కొందరు నెటిజన్లు ఆ ఖర్చు చూసి ఆశ్చర్యపోగా.. మరికొందరు మాత్రం ఆ జంట మహారాజుల్లా బతికారు కాబట్టి అంత ఖర్చవ్వడంలో వింతేమీ లేదన్నారు. ఖచ్చితంగా మహారాజుల్లా రాజభోగాలు అనుభవించి ఉంటారని ఒకరు కామెంట్ చేశారు. వామ్మో..ఇది నిజంగానే చాలా ఎక్కువ అని కొందరన్నారు. ప్రత్యేక అనుభూతులు మిగుల్చుకోవాలంటే.. తప్పదు మరి. అయితే కరోనా తరువాత ఖర్చులు బాగా పెరిగాయన్నారు మరొకరు.


