
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వామపక్ష భావజాలమున్న ఎంటిఫా సంస్థను ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. కన్జర్వేటిక్ ఉద్యమకారుడు చార్లీ కిర్క్ హత్య నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తన సోషల్ మీడియాలో స్వయంగా ఆయన ప్రకటన చేశారు.
ఎంటిఫాను ప్రధాన ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ సోషల్ మీడియా ద్వారా ట్రంప్ ప్రకటన చేశారు. దానిని అత్యంత ప్రమాదకరమైన సంస్థగా.. రాడికల్ లెఫ్ట్ విపత్తుగా ఆయన అభివర్ణించారు. అంతేకాదు దీనికి నిధులు సమకూర్చే వారిపై కఠిన విచారణ జరపాలని దర్యాప్తు సంస్థలకు సూచించారాయన.
The United States of America will be designating ANTIFA as a Terrorist Organization.
— Donald J. Trump (@realDonaldTrump) May 31, 2020
ఏంటీ ఎంటిఫా..
Antifa అంటే ఫాసిస్ట్ వ్యతిరేక (anti-fascist) పదానికి సంక్షిప్త రూపం. ఇదేం ఒక అధికార, కేంద్రీకృత సంస్థ కాదు. ఫార్-లెఫ్ట్ కార్యకర్తల గ్రూప్. ఫాసిజం, రేసిజం, అన్నింటికంటే ముఖ్యంగా కన్జర్వేటివ్ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడే రాజకీయ ఉద్యమం అని చెప్పొచ్చు. ఈ సభ్యులు తరచూ ఫార్-రైట్ ర్యాలీలను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. బెల్లా సియావో(Bella Ciao) వంటి పాటలు, 1917 రష్యా విప్లవానికి సంబంధించిన గుర్తులను, నినాదాలను తమ నిరసనలకు ఉపయోగిస్తుంటారు. సోషల్ మీడియాలో సిగ్నల్, ఇతర ఎన్‌క్రిప్టెడ్ యాప్స్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. అయితే..
ట్రంప్ గత టర్మ్‌లోనే ఈ గ్రూప్‌ను ఉగ్రసంస్థగా గుర్తించాలని అనుకున్నారు. కానీ అది వీలుపడలేదు. ఇప్పుడు తనకు సన్నిహితుడైన చార్లీ కిర్క్ హత్యతో ఆ పని చేశారు. అయితే Antifa అనేది ఒక సిద్ధాంతం మాత్రమేనని, దానిని సంస్థగా గుర్తించి నిషేధించడం అసాధ్యమని, పైగా చట్టపరంగా ఇబ్బందులూ ఎదురుకావొచ్చని ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ క్రిస్టోఫర్ రే అభిప్రాయపడుతున్నారు.
కిర్క్ మరణం
కన్జర్వేటివ్ కార్యకర్త చార్లీ కిర్క్ మరణం.. అమెరికాలో రాజకీయ దుమారం రేపింది. సెప్టెంబర్ 10వ తేదీన ఉటా యూనివర్సిటీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన్ని రైఫిల్‌తో కాల్చి చంపారు. ఒకే భావజాలం ఉన్న ట్రంప్ కోసం అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో కిర్క్ ప్రచారం కూడా చేశారు. దీంతో తన ఆప్తుడి మరణంపై ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదని మండిపడ్డారాయన.
ఈ క్రమంలో.. వామపక్ష భావజాలం ఉన్న 22 ఏళ్ల టైలర్ రాబిన్సన్ అనే వ్యక్తిని ఎఫ్‌బీఐ అరెస్ట్ చేసింది. ఘటనా స్థలంలో "Hey fascist! Catch!" వంటి రాతలున్న బుల్లెట్ కేసింగ్‌లపై కనిపించడం గమనార్హం. అయితే రాబిన్‌సన్ Antifa సభ్యుడా అనే విషయాన్ని ఎఫ్‌బీఐ ఇంకా నిర్ధారించలేదు. కానీ ట్రంప్ మాత్రం అతను ‘‘ఇంటర్నెట్ ద్వారా రాడికలైజ్ అయ్యాడు’’ అని చెబుతుండడం గమనార్హం.