పారిస్ సెయింట్-జెర్మైన్ ఛాంపియన్స్ లీగ్ ముగిసిన తర్వాత హింస చెలరేగిన విషయం తెలిసిందే. శనివారం అర్ధరాత్రి హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో జరిగిన ఫైనల్‌లో పారిస్ సెయింట్-జెర్మైన్ విజయం సాధించడంతో వేలాది మంది పారిస్ వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. ఆ సమయంలో కొన్ని గ్రూపులు పోలీసులతో ఘర్షణలకు దిగాయి.
గత ఏడాది పారిస్ సెయింట్-జెర్మైన్ ఇదే పోటీని గెలిచిన సమయంలో అల్లర్లు చెలరేగిన నేపథ్యంతో ఫ్రాన్స్ అంతటా సుమారు 22,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. అయినప్పటికీ ఇప్పుడు కూడా హింస చెలరేగింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం 780 మందిని అరెస్టు చేసినట్లు ఫ్రెంచ్ అధికారులు ఆదివారం ప్రకటించారు. వారిలో 450 మందికి పైగా ఇప్పటికీ తమ అదుపులోనే ఉన్నారని తెలిపారు.
వారు భద్రతా సిబ్బందే లక్ష్యంగా నిందితులు బాణసంచాను విసేరేశారని చెప్పారు. అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ న్యునెన్జ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 57 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారని తెలిపారు. ఫ్రాన్స్ అంతటా ఫుట్‌బాల్ అభిమానులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణల్లో మొత్తం 219 మంది గాయపడ్డారు. వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ నునెజ్ తెలిపారు.
పారిస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. 25 వయస్సు ఉన్న ఓ యువకుడు తన మోటోక్రాస్ బైక్‌పై పారిస్ రింగ్ రోడ్ ఎగ్జిట్ ర్యాంప్ వద్ద కాంక్రీట్ బ్లాక్‌లను ఢీకొట్టి మరణించాడు. ఓ వివాదంలో కత్తి దాడికి గురైన మరో యువకుడు పారిస్‌లో తీవ్రంగా గాయపడ్డాడని ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది.
దేశవ్యాప్తంగా సుమారు 15 నగరాల్లో దొంగతనాలు, దోపిడీలు జరిగాయని, 71 మున్సిపాలిటీల్లో హింసాత్మక ఘటనలు నమోదయ్యాయని పేర్కొంది. గత ఏడాది పారిస్ సెయింట్-జెర్మైన్ ఛాంపియన్స్ లీగ్ విజయం తర్వాత జరిగిన వేడుకలతో పోల్చితే ఈ సారి అరెస్టుల సంఖ్య 32 శాతం పెరిగిందని చెప్పింది. పారిస్ రాజధానిలో బస్సు, రైలు సేవలకు అంతరాయం కలిగించేలా చెలరేగిన అల్లర్లను అదుపు చేసేందుకు వేలాది మంది పోలీసులను మోహరించారు. ఆదివారం ఈఫిల్ టవర్ సమీపంలో జరిగే విజయోత్సవ ర్యాలీ భద్రత కోసం సుమారు 6,000 మంది పోలీసులను మోహరించారు.


