ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని ఫిబ్రవరి 28న ప్రారంభించిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'లో అమెరికాకు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ సైనిక చర్యలో అమెరికాకు చెందిన అత్యాధునిక ఫైటర్ జెట్లు, నిఘా డ్రోన్లతో సహా కనీసం 42 విమానాలు పూర్తిగా ధ్వంసమవ్వడమో లేదా దెబ్బతినడమో జరిగిందని 'కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్' తన తాజా నివేదికలో వెల్లడించింది.
అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఇతర భద్రతా కారణాల వల్ల ఈ నష్టం తీవత్ర ఇంకా పెరిగే అవకాశముందని సదరు నివేదిక పేర్కొంది. యూఎస్ సెంట్రల్ కమాండ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలు, అంతర్జాతీయ వార్త కథనాల ఆధారంగా ఈ దెబ్బతిన్న విమానాల జాబితాను సీఆర్‌ఎస్ సిద్దం చేసింది.
ఇరాన్‌తో యుద్దంగా కారణంగా ద్వంసమైన వాటిలో 4 ఎఫ్-15ఇ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాలు, అత్యాధునిక ఎఫ్-35ఏ లైట్నింగ్ II యుద్ధ విమానం, ఏ-10 థండర్‌బోల్ట్ గ్రౌండ్-అటాక్ విమానం ఉంది. వీటితోపాటు ఆకాశంలోనే ఇంధనాన్ని నింపే ఏడు కేసీ-135 స్ట్రాటోట్యాంకర్విమానాలు, ఒక ఈ-3 సెంటినరీ అవాక్స్ నిఘా విమానం, రెండు ఎమ్సి-130జే కమాండో II, ప్రత్యేక కార్యాచరణ విమానాలు, ఒక హెచ్‌హెచ్-60డబ్ల్యూ జాలీ గ్రీన్ II హెలికాప్టర్ ఉన్నాయి.
అదేవిధంగా శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఎమ్క్యూ-9 రీపర్ డ్రోన్లు మొత్తం 24 దెబ్బతిన్నాయి. వీటితో పాటు ఒక ఎమ్క్యూ-4సీ ట్రైటాన్ నిఘా డ్రోన్ కూడా ద్వంసమైంది.
ఈ నివేదికపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ స్పందించారు. అత్యంత అధునాతనమైన ఎఫ్-35 యుద్ధ విమానాన్ని కూల్చివేసిన ఘనత తమ సైన్యానిదేనని సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రకటించారు. కాగా ఇరాన్‌లో కొనసాగుతున్న సైనిక చర్యల అంచనా వ్యయం ప్రస్తుతం 29 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 2,42,000 కోట్లు) పెరిగినట్లు పెంటగాన్ కంప్ట్రోలర్ జూల్స్ డబ్ల్యూ హర్స్ట్ III ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


