మహాలక్ష్మిపై చిన్నచూపు | - | Sakshi
Sakshi News home page

మహాలక్ష్మిపై చిన్నచూపు

May 18 2026 10:43 AM | Updated on May 18 2026 10:43 AM

మహాలక్ష్మిపై చిన్నచూపు సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై చులకన

సాక్షి, సిటీబ్యూరో: మెహిదీపట్నం నుంచి సికింద్రాబాద్‌ మీదుగా చర్లపల్లి వెళ్లే (49ఎం/250) బస్సు. బంజారాహిల్స్‌ ఒకటో నంబర్‌ రోడ్‌ బస్టాపులో ఇద్దరు మహిళలు ఎదురుచూస్తున్నారు. సుమారు 45 నిమిషాల నిరీక్షణ తర్వాత వచ్చిన ఆ బస్సును చూసి ఊపిరి పీల్చుకున్నారు. కానీ అది అక్కడ ఆగకుండానే ముందుకు కదిలింది. దాంతో ఆ మహిళలు నిస్సహాయంగా మరో బస్సు కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఇలా.. ఈ ఒక్క రూట్‌లోనే కాదు. నగరంలోని అనేక చోట్ల ఇదే పరిస్థితి. ఒకరిద్దరు మహిళా ప్రయాణికులు కనిపిస్తే చాలు బస్సులు నిలపకుండానే డ్రైవర్లు పరుగులు తీస్తున్నారు. సాధారణంగా అప్పటికే బస్సులు పూర్తిగా నిండిపోయి అదనంగా ప్రయాణికులను తీసుకెళ్లేందుకు ఏ మాత్రం అవకాశం లేనప్పుడు ఇలా నిలపకుండా వెళ్లిపోవడం పరిపాటి. కానీ అందుకు భిన్నంగా బస్సుల్లో ప్రయాణికులు లేకపోయినా సరే మహిళలు కనిపిస్తే చాలు ఆపడం లేదంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మహిళల ఉచిత ప్రయాణంపై చాలామంది డ్రైవర్లు, కండక్టర్లు చులకన భావాన్ని ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

సిబ్బందితో ఘర్షణ..

ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత సిటీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రైవేట్‌ రంగంలో పనిచేసే మహిళా ఉద్యోగులు, చిరు వ్యాపారులు, విద్యార్థినులకు ఇది ఆర్థికంగా ఎంతో ఊరటనిస్తోంది. ప్రైవేట్‌ సంస్థల్లో పనిచేసే ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి ప్రతి నెలా కనీసం రూ.3000 నుంచి రూ.5000 వరకు చార్జీల రూపంలో చెల్లించాల్సిన డబ్బులు ఆదా అవుతున్నాయి. దీంతో అన్ని బస్సుల్లో 70 శాతం మహిళా ప్రయాణికులే కనిపిస్తున్నారు. మరోవైపు సిటీ బస్సులు సైతం 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఇది ఎంతో ఆహ్వానించదగిన పరిణామం. మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారనే చులన భావంతోనే కండక్టర్లులు, డ్రైవర్లు బస్టాపుల్లో బస్సులను ఆపకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో కొందరు మహిళలకు, ఆర్టీసీ సిబ్బందికి మధ్య తరచుగా ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.

జనరల్‌ సీట్లలో కూర్చోవద్దా..?

మహిళా ప్రయాణికులు జనరల్‌ సీట్లలో కూర్చుంటే లేపేస్తున్నారు. బస్సుల్లో రద్దీ కారణంగా ఒక్కోసారి వెనుక ద్వారం నుంచి కూడా బస్సు ఎక్కాల్సి వస్తోంది. అలా ప్రవేశించేవారిని దింపేస్తున్నారు. ముందు నుంచి రావాలంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వాళ్లు వెనుక నుంచి ముందుకు వచ్చే లోపు బస్సు కదిలిపోతుంది’ అని బంజారాహిల్స్‌ నుంచి హబ్సిగూడకు చెందిన ఓ మహిళ విస్మయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కండక్టర్‌లతో గొడవలు తప్పడం లేదని చెప్పారు. గతంలో ప్రతిరోజు 8 లక్షల నుంచి 12 లక్షల మంది మహిళలు ప్రయాణించగా ప్రస్తుతం సుమారు 16 లక్షల మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కోట్లాది మంది ప్రయాణం చేసినట్లు అంచనా. మహిళా ప్రయాణికుల చార్జీలను ప్రభుత్వమే చెల్లిస్తున్నా.. ఆర్టీసీ సిబ్బంది ప్రవర్తన అభ్యంతరకరంగా ఉంటోందని పలువురు మహిళా ప్రయాణికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

స్టాపుల్లో బస్సులు ఆపకుండానే వెళ్తున్న డ్రైవర్లు

కసురుకుంటున్న కొందరు కండక్టర్లు

జనరల్‌ సీట్లలో కూర్చోవద్దంటూ ఇబ్బందులు

ఆవేదన వ్యక్తంచేస్తున్న మహిళా ప్రయాణికులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement