అయినా కావాలి..నేపాలీ ! | - | Sakshi
Sakshi News home page

అయినా కావాలి..నేపాలీ !

May 18 2026 10:43 AM | Updated on May 18 2026 10:43 AM

దోపిడీలు చేస్తున్నా పనిలోంచి తొలగించేందుకు పలువురు ససేమిరా..

బంజారాహిల్స్‌: తక్కువ జీతం ఎక్కువ పని.. ఏడాది ఒక్కసారైనా సెలవు తీసుకోకపోవడం.. 24 గంటలూ ఇంటిపట్టునే ఉండడం..ఏ పని చెప్పినా కాదనకపోవడం.. పని ఎగ్గొట్టకపోవడం..ఇదీ నేపాలీ పనిమనుషులు చేస్తున్న పనులు. దీంతో వీరిని తొలగించాలంటే యజమానులు ససేమిరా అంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో చోటుచేసుకున్న నేపాలీ గ్యాంగ్‌ల దొంగతనాల దృష్ట్యా వారిని పనిలో నుంచి తొలగించాలంటూ నగరంలో అన్ని ఠాణాల పోలీసులు వారి వివరాలను సేకరించి యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే ఎన్నో ఏళ్లుగా తమ ఇళ్లల్లో పనిచేస్తున్న నేపాలీ పనిమనుషులను దూరం పెట్టడానికి యజమానులు అంగీకరించడం లేదు.

● ఈ నెల 8వ తేదీన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ప్రశాసన్‌నగర్‌లో మాజీ ఐపీఎస్‌ అధికారి భార్య తనూజరంజన్‌ను ఆ ఇంటి పనిమనిషి కల్పనతో పాటు మరో ముగ్గురు నేపాలీలు కలిసి దారుణంగా హత్య చేసి నగలతో ఉడాయించారు. నేపాలీ పనిమనుషుల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్థానిక పోలీసులు ఈ కాలనీలో నేపాలీ పనిమనుషులను ఎవరెవరు పెట్టుకున్నారో ఆ యజమానులను కలిశారు. మొత్తం 37 ఇళ్లల్లో నేపాలీ పనిమనుషులు ఉన్నారు.

● తమ ఇంట్లో గత 15 సంవత్సరాలుగా నేపాలీ జంట పనిచేస్తుందని, నమ్మకంగా ఉంటున్నారని, ఇప్పుడు వారిని తొలగిస్తే తమకు ఇబ్బందులు ఎదురవుతాయని, వీరి లాగా మరెవరూ పనిచేయలేరని ఓ అధికారి పోలీసుల మొహం మీదనే చెప్పేశాడు. వీరి పనితనం ఏమిటో ఆయన పూసగుచ్చినట్లు చెప్పారు. దీంతో చేసేదేమీ లేక పోలీసులు వెనుదిరిగారు.

● బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌తో పాటు వెస్ట్‌జోన్‌ పరిధిలోని సుమారు 1360 మంది నేపాలీలు ఇళ్లల్లో పనిచేస్తున్నారు. ఇటీవల పోలీసులు నోటీసులు ఇచ్చి కనీసం వారి వివరాలైనా తీసుకోవాలని చెప్పినా ఒక్కరూ స్పందించిన పాపానపోలేదు. ప్రశాసన్‌నగర్‌లో ఇంత పెద్ద ఘటన జరిగినా నేపాలీ పనిమనుషుల విషయంలో అక్కడి బ్యూరోక్రాట్లు ఏమాత్రం భయపడకపోగా ఏళ్లతరబడి ఇక్కడే పనిచేస్తున్నారని, వారిని తొలగించడం కష్టమంటూ చెప్పేస్తున్నారు. దీంతో ఏమి చేయాలో తెలియక పోలీసులు తలపట్టుకుంటున్నారు.

తక్కువ జీతం..ఎక్కువ పని.. ఏడాదికోసారి సెలవు

అందుకే వారివైపు మొగ్గు

దశాబ్దాల తరబడి సేవలందిస్తూ..

ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనలు నేపాలీల పట్ల నమ్మకాన్ని కోల్పోయేలా చేసినా దశాబ్దాల తరబడి నగరంతో వీరి అనుబంధం విడదీయలేనిది. సెక్యూరిటీగార్డులుగా, ఇంటి కాపలాదారులుగా, డ్రైవర్లుగా, పనిమనుషులుగా, వంటవాళ్లుగా చాలా ఇళ్లల్లో దశాబ్దాలుగా వీరి సేవలు కొనసాగుతున్నాయి. వీరు తక్కువ జీతానికి ఎక్కువ పనిచేయడం బాగా కలిసివస్తుంది. ఇళ్లల్లోనే చిన్న గది ఇచ్చినా కుటుంబం అంతా సర్దుకుపోతుంది. వీళ్లు ఏడాది, రెండేళ్లకు ఒక్కసారే వారం రోజులు సెలవుపెట్టి స్వగ్రామమైన నేపాల్‌కు వెళ్తుంటారు. మిగతా ఏడాదంతా ఇంటిపట్టునే ఉంటారు.

ముఖ్యంగా ఇంట్లో ఉండే వృద్ధులకు వీరి అవసరం ఎంతో ఉంటుంది. అందులోనూ ఇతర రాష్ట్రాలకు చెందిన వారైతే వీరి చేసే వంటలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఏరకంగా చూసినా వీరి వల్ల ఎక్కువ లాభాలే తప్పితే అతి తక్కువ నష్టాలు కనబడుతుండడంతో యజమానులెవరూ వీరిని తొలగించడానికి సిద్ధంగా ఉండడం లేదు. ఇప్పటివరకు ఒక్క యజమాని కూడా తమ ఇంట్లో పనిచేస్తున్న నేపాలీలను వెళ్లిపోమ్మని చెప్పలేదంటే ప్రతి ఇంటికీ వీరి అవసరం ఎంత ఉందో అర్ధంచేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement