
అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం
జూబ్లీహిల్స్ టికెట్‌పై ఎమ్మెల్యే దానం వ్యాఖ్యలు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ అధిష్టానం నిర్ణయించిన వ్యక్తి గెలుపు కోసం కృషి చేస్తామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. గురువారం ఆదర్శనగర్‌లో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మీరు పోటీ చేస్తారని, మంత్రి పదవి దక్కే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వస్తున్నాయి’ అంటూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు.. స్పందిస్తూ.. అవన్నీ ఊహాగానాలు కావచ్చన్నారు. అయితే.. అధిష్టానం నిర్ణయం మేరకు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక ఉంటుందని, టికెట్ ఎవరికి వచ్చినా అభ్యర్థి గెలుపు కోసం కష్టపడి పని చేస్తామన్నారు. ప్రసుత్త పరిస్థితిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడం ఎంతో అవసరమన్నారు. కొంతకాలంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో దానం నాగేందర్ నిలిచే అవకాశం ఉందంటూ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
బలమైన సామాజిక వర్గం అండదండ ఉండడంతో పాటు మైనార్టీ వర్గాల్లో సైతం ఆయనకు మంచి పరపతి ఉండడం, పార్లమెంట్ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దానం నాగేందర్‌కు సుమారు 85,000 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన జూబ్లీహిల్స్‌లో సులభంగా గెలిచే అవకాశం ఉందంటూ పార్టీ పెద్దలు సైతం భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.