
అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివి..
బహదూర్ పురా: అటవీ సంపద పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని రాష్ట్ర అటవీ శాఖ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఇకపై ప్రతిభావంతులైన ఫ్రంట్‌లైన్ అధికారులకు ఏటా రూ.10 వేలు నగదు పురస్కారం అందిస్తామన్నారు. అటవీ సంపదను దోచుకునే స్మగ్లర్లు, అరాచక ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలు వృథా కానివ్వమన్నారు. గురువారం నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కు ఆవరణలోని అమరవీరుల విగ్రహం వద్ద నిర్వహించిన జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ డాక్టర్ జితేందర్, రాష్ట్ర అటవీ ప్రధాన అధికారిణి డాక్టర్ సువర్ణలతో కలసి పాల్గొన్నారు. స్మారక చిహ్నం వద్ద పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ విధి నిర్వహణలో అటవీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. 1984 సంవత్సరం నుండి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో విధి నిర్వహణలో 22 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. వీరి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పచ్చదనం పెంపులో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘వన మహోత్సవం’ ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద మానవ ప్రయత్నమన్నారు. వనమహోత్సవం ద్వారా మన రాష్ట్రంలో 307.48 కోట్లకు పైగా మొక్కలను ఇప్పటికే నాటడం జరిగిందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ అడవులను కాపాడుతున్న అటవీ అధికారుల కృషి అభినందనీయమన్నారు. ఎటువంటి సౌకర్యాలు లేనిచోట, దట్టమైన అడవుల్లో వారి ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి అడవులను కాపాడుతున్నారన్నారని, విధి నిర్వహణలో అమరులైన అటవీ అధికారులు, సిబ్బంది త్యాగాలను స్మరించుకోవాలన్నారు. డీజీపీ డాక్టర్ జితేందర్ మాట్లాడుతూ..అడవులను కాపాడేందుకు అధికారులు చేస్తున్న కృషి ఎంతో గొప్పదన్నారు. రాష్ట్ర అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్ మాట్లాడుతూ అడవులను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వాటిని కాపాడటమే అమరులకు మనం ఇచ్చే నిజమైన నివాళి అవుతుందని తెలిపారు. కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణ అధికారిణి డాక్టర్ సువర్ణ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఎలుసింగ్ మేరు, పీసీపీఎఫ్ జౌహరి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, సౌత్ జోన్ డీసీపీ స్నేహా మెహ్రా, అడిషనల్ పీసీపీఎఫ్‌లు సి.శరవనణ్, , ప్రియాంక వర్గీస్, జూపార్కుల డైరెక్టర్ డాక్టర్ సునీల్, క్యురేటర్ జె.వసంత, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ క్షితిజ, డాక్టర్ జి. రామలింగం, జీహెచ్‌ఎంసీ అర్బన్ ఫారెసీ్ట్ర డైరెక్టర్ సుభద్రాదేవి, జూపార్క్ డిప్యూటీ డైరెక్టర్ (వెటర్నరీ) డా.ఎం.ఎ. హకీమ్, డిప్యూటీ క్యురేటర్ బర్నోబా, అసిస్టెంట్ డైరెక్టర్ (వెట్) శ్రీనివాస్ , మాజీ క్యూరేటర్లు ఎ.శంకరన్, రాజశేఖర్, మాజీ డిప్యూటీ క్యూరేటర్ ఎ.నాగమణి, అసిస్టెంట్ క్యురేటర్లు నాజియా తబుసుమ్, ఎన్.లక్ష్మణ్, ఈపీఆర్‌ఓ హనీఫుల్లా, జూ సిబ్బంది పాల్గొన్నారు.
మంత్రి కొండా సురేఖ