
హెచ్‌సీఎస్సీ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సమ్మిట్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్‌సీఎస్సీ) ఆధ్వర్యంలో ట్రాఫిక్ సమ్మిట్–2025 నిర్వహించాలని నగర పోలీసు విభాగం నిర్ణయించింది. ఈ నెల 18, 19 తేదీల్లో జల విహార్ కేంద్రంగా జరుగనుంది. దీనికి సంబంధించిన లోగోను నగర ట్రాఫిక్ విభాగం చీఫ్ జోయల్ డెవిస్ గురువారం ఆవిష్కరించారు. ఈ సమ్మిట్‌లో వివిధ ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు, నిపుణులతో పాటు సాధారణ ప్రజలు సైతం పాల్గొనున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేని సురక్షిత నగరాన్ని సాకారం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి కీలక సలహాలు, సూచనలను ఇవ్వనున్నారు.
ప్రైవేటు బస్సులో కీచక డ్రైవర్
శివాజీనగర (బెంగళూరు): బస్సులో ఒంటరిగా ప్రయాణించిన బాలిక మీద లైంగిక వేధింపులకు పాల్పడిన కీచక డ్రైవర్‌కు బాలిక కుటుంబీకులు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున బెంగళూరులో బసవేశ్వర సర్కిల్‌లో జరిగింది. వివరాలు.. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రైవేటు స్లీపర్ బస్సు బయల్దేరింది. అందులో ఓ బాలిక (15) బెంగళూరుకు వస్తోంది. మొబైల్‌ఫోన్ చార్జింగ్ అయిపోవడంతో చార్జింగ్ చేయాలని డ్రైవర్‌ను కోరింది. కొంతసేపటి తరువాత బాలిక మొబైల్ ఇవ్వాలని అడిగితే, ముద్దివ్వాలని డ్రైవర్ ఆరిఫ్ (41) బాలికను ఒత్తిడి చేశాడు. తరువాత బాలిక తన సీటు వద్దకు వెళ్లి నిద్రపోయింది. డ్రైవర్ బాలిక వద్దకు వెళ్లి తరచూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇది తట్టుకోలేక బాలిక తల్లికి ఫోన్ చేసి చెప్పింది. బస్సు సిటీకి రాగానే బాలిక తల్లి, సోదరుడు బస్సు నిలిపి డ్రైవర్ ఆరిఫ్‌ను ప్రశ్నించారు. డ్రైవర్ తప్పయిపోయిందంటూ చేతులెత్తి మొక్కి వేడుకున్నాడు. బాలిక కుటుంబీకులు అతన్ని చితకబాదారు. ఇంతలో పోలీసులు చేరుకొని డ్రైవర్‌ని అరెస్ట్ చేశారు.
● ఒంటరి బాలికపై లైంగిక వేధింపులు
● చితకబాదిన కుటుంబీకులు
● హైదరాబాద్ టు బెంగళూరు బస్సులో ఘటన