
స్వామి వివేకానంద బోధనలు స్ఫూర్తిదాయకం
కవాడిగూడ: స్వామి వివేకానంద బోధనలు స్ఫూర్తిదాయకమని రాజ్యసభ సభ్యులు అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. గురువారం రామకృష్ణ మఠంలోని వివేకానంద ఆడిటోరియంలో స్వామి వివేకానంద హ్యుమన్ ఎక్స్‌లెన్సీ సిల్వర్‌జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా సంప్రీతి దివస్ పేరిట యూత్ కన్వెన్షన్ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడారు. స్వామి వివేకానంద 1893 సెప్టెంబర్ 11న చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో చేసిన ప్రసంగం ప్రపంచాన్నే ఆకర్షించిందన్నారు. ఆయన స్ఫూర్తితో రామకృష్ణ మఠంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. భారతదేశంలోని ఆధ్యాత్మికత, సహనం, ఐక్యత వంటి అంశాలను తన ప్రసంగం ద్వారా వివేకానందుడు ప్రపంచానికి చాటారని తెలిపారు. యువత స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకొన దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకావాల్సి ఉండగా..కొన్ని కారణాలతో హాజరుకాలేక పోయారని, భవిష్యత్తులో సీఎంను తీసుకొచ్చే బాధ్యత తనదే అని అనిల్‌కుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణమఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద, కలకత్తా రామకృష్ణ మఠం అధ్యక్షులు నిత్య ముక్తానంద స్వామి తదితరులు ప్రసంగించారు. అనంతరం ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్‌ను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు.
ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్