
జింక కొమ్ముల విక్రయానికి యత్నం
సాక్షి, సిటీబ్యూరో: అరుదైన యాంటిలోప్ సెర్వికాప్రా జాతికి చెందిన జింక కొమ్ములు విక్రయించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇతడి నుంచి రెండు కొమ్ములు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం అటవీ శాఖ అధికారులకు అప్పగించినట్లు అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు గురువారం వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన మహ్మద్ ఖలీముద్దీన్ అలియాస్ సలీం వృత్తిరీత్యా తాపీ మేస్త్రి. బతుకుతెరువు కోసం నగరానికి వలసవచ్చిన ఇతగాడు షహీన్‌నగర్‌లో ఓ పాన్‌షాపు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఆదాయం కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో సదాశివపేటకు రాకపోకలు సాగిస్తూ మేసీ్త్ర పని కూడా చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం అక్కడ ఓ ఇంటి కూల్చివేత పనులు చేస్తుండగా ఇతడికి జింక కొమ్ములు దొరికాయి. వీటిని సొంతం చేసుకుని సలీం నల్లరంగు కవర్‌లో చుట్టి నగరానికి తీసుకువచ్చాడు. తొలినాళ్లల్లో ఆ కొమ్ముల నుంచి చిన్న ముక్కలు వేరుచేసి పొడి చేసేవాడు. దీన్ని వినియోగిస్తే ఎముకలు పటిష్టం కావడంతో పాటు కొన్ని రోగాలు తగ్గుతామని నమ్మబలికి విక్రయించే వాడు. ఇటీవల రెండు కొమ్ముల్నీ విక్రయించాలని భావించిన సలీం ఖరీదు చేసే వ్యక్తుల కోసం వెతుకుతున్నాడు. దీనిపై తూర్పు మండల టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. ఇన్‌స్పెక్టర్ ఎ.నాగార్జున నేతృత్వంలో ఎస్సైలు ఎం.అనంతాచారి, ఎస్.కరుణాకర్‌రెడ్డి తమ బృందాలతో వలపన్ని సలీంను పట్టుకున్నారు. అతడి నుంచి రెండు జింక కొమ్ములు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.
నిందితుడిని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్