
14.9 కిలోల గంజాయి స్వాధీనం
ఇద్దరి అరెస్టు
సికింద్రాబాద్: విశాఖపట్నం నుంచి ఢిల్లీకి గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.18.47 లక్షల విలువచేసే 14.9 కిలోల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. జీఆర్‌పీ డీఎస్‌పీ ఎస్‌ఎన్ జావెద్, జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్లు సాయీశ్వర్‌గౌడ్, సారస్వత్‌లు వెల్లడించిన వివరాల ప్రకారం..ఢిల్లీ చాందినీ చౌక్‌కు చెందిన చంద్రప్రకాశ్ అనే ఫుట్‌పాత్ వస్త్రవ్యాపారి, అదేప్రాంతానికి చెందిన జమీలాఖాతూన్‌లు స్నేహితులు. చంద్రప్రకాశ్ మాదకద్రవ్యాల వినియోగానికి బానిస అవగా, జమీలాఖాతూన్‌కు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. వీరిరువురు గంజాయి రవాణా వ్యాపారం చేసి పెద్దమొత్తంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉండగా చంద్రప్రకాశ్‌కు ఫేస్‌బుక్ ద్వారా ఫరాన్‌ఖాన్ అనే గంజాయి వ్యాపారి పరిచయం అయ్యాడు. అతని ద్వారా విజయనగరం వెళ్లిన వీరిద్దరు 14.9 కిలోల గంజాయి ప్యాకెట్లు సేకరించి విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలు ద్వారా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ చేరుకున్నారు. ఢిల్లీ రైలు ఎక్కేందుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వెయిటింగ్ హాలులో వేచిచూస్తుండగా పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. కేసులు నమోదు చేసిన పోలీసులు ఇరువుర్ని రిమాండ్‌కు తరలించి గంజాయి విక్రయించిన ఫరాన్‌ఖాన్‌ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.