రూ.1.92 కోట్ల ‘పాత కరెన్సీ’ స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

రూ.1.92 కోట్ల ‘పాత కరెన్సీ’ స్వాధీనం

Sep 9 2025 12:38 PM | Updated on Sep 9 2025 12:38 PM

రూ.1.92 కోట్ల ‘పాత కరెన్సీ’ స్వాధీనం

రూ.1.92 కోట్ల ‘పాత కరెన్సీ’ స్వాధీనం

● నలుగురిని అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్‌ ● మరికొందరి కోసం కొనసాగుతున్న గాలింపు

● నలుగురిని అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్‌ ● మరికొందరి కోసం కొనసాగుతున్న గాలింపు

సాక్షి, సిటీబ్యూరో: సుదీర్ఘకాలం తర్వాత నగరంలో మరోసారి రద్దయిన రూ.500, రూ.1000 నోట్లు పట్టుబడ్డాయి. 2016లో డీమానిటైజేషన్‌ తర్వాత దాదాపు రెండున్నరేళ్ల పాటు ఈ కేసులు నమోదైనా... ఆ తర్వాత తగ్గిపోయాయి. తాజాగా సోమవారం రాత్రి నలుగురిని అదుపులోకి తీసుకున్న ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రూ.1.92 కోట్ల పాత కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. వీరిచ్చిన సమాచారంతో సూత్రధారులతో పాటు మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. డీమానిటైజేషన్‌ సమయంలో ప్రభుత్వం పాత కరెన్సీ మార్పిడికి అవకాశం ఇచ్చింది. బ్యాంకులతో పాటు కొన్ని పోస్టాఫీసుల్లోనూ ఆధార్‌ సహా ఇతర ఆధారాలు సమర్పించి నగదు మార్పిడి చేసుకోవడానికి, బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే బ్లాక్‌ కరెన్సీ కలిగిన అనేక మంది అప్పట్లో మార్పిడి, డిపాజిట్‌ చేసుకునేందుకు ముందుకు రాలేదు. ఇలాంటి వారికోసం పని చేసిన కొన్ని ముఠాలు కమీషన్‌ ప్రాతిపదికన వీటిని మార్పిడి చేశాయి. మరికొందరు మార్పిడి పేరుతో ఎర వేసి అందినకాడికి దండుకుని ఉడాయించారు. కొందరు సూడో పోలీసులు, ఖాకీలు సైతం ఈ దందాలు నడిపారు. 2016–18 మధ్య ఇలాంటి కేసులు అనేకం నమోదయ్యాయి. అయితే కరోనా ప్రభావంతో అమలులోకి వచ్చిన లాక్‌డౌన్‌ తర్వాత ఇలాంటి మోసాలు, వ్యవహారాలు, కేసులు దాదాపుగా తగ్గిపోయాయి. అప్పుడప్పుడు మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి ఓ ఉదంతమే సోమవారం బయటకు వచ్చింది. కొందరు వ్యక్తులు కమీషన్‌ తీసుకుని పాత కరెన్సీని మార్చి, కొత్త రూ.500, రూ.200, రూ.100 నోట్లు ఇస్తామంటూ ప్రచారం చేసుకున్నారు. వీరి మాటలు నమ్మిన కొందరు తమ వద్ద ఉన్న నగదును ఇద్దరు వ్యక్తులకు ఇచ్చి పంపారు. దీనిపై సమాచారం అందుకున్న ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం నారాయణగూడ పోలీసుస్టేషన్‌ పరిధిలో వలపన్నారు. శాంతి థియేటర్‌ ఎదురుగా ఉన్న కెనరా బ్యాంక్‌ వద్ద ఇద్దరిని, వీరిచ్చిన సమాచారంతో వాటర్‌ వర్క్స్‌ కార్యాలయం వద్ద ఎదురు చూస్తున్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న మూడు బ్యాగులను తనిఖీ చేయగా... అందులో రూ.1.92 కోట్ల పాత కరెన్సీ లభించింది. ఇందులో అత్యధికం రూ.1000 నోట్లే ఉన్నట్లు తెలుస్తోంది. వీరి విచారణ నేపథ్యంలో ఈ కరెన్సీని మార్పిడి కోసం ఇచ్చిన వారు, మారుస్తామంటూ ఒప్పందం చేసుకున్న వారు మరి కొందరు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని మియాపూర్‌లోని ఓ ఇంట్లో మరికొందరు అనుమానితులు ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్‌ గుర్తించింది. దీంతో వారితో పాటు ఇతర నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. అందరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తేనే ఈ కరెన్సీ మూలాలు, మొత్తం ఎంత ఉందనేది తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. దీనిపై మంగళవారం పూర్తి స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. ఈ నలుగురు నిందితులను అధికారులు టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయానికి తరలించి వివిధ కోణాల్లో విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement