
ఆటో దొంగను పట్టించిన వాట్సాప్ గ్రూప్
గ్రూపులో పెట్టిన గంటన్నరలోనే గుర్తించిన సభ్యుడు..
బంజారాహిల్స్: ఇంటి ముందు పార్కింగ్ చేసిన ఆటో చోరీకి గురికాగా, ఈ వైనాన్ని సదరు ఆటోడ్రైవర్ తమ ప్రాంతానికి చెందిన వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశాడు. దీంతో గ్రూప్ సభ్యులు ఈ విషయాన్ని షేర్ చేయడంతో గంటన్నర వ్యవధిలోనే ఆల్వాల్‌లో దొంగతనానికి గురైన ఈ ఆటో బంజారాహిల్స్‌లో పట్టుబడింది. వివరాల్లోకి వెళితే.. బొల్లారం రిసాలబజార్‌లో నివసించే ఝార్ఖండ్‌కు చెందిన బిపిన్‌రాజ్‌యాదవ్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి ఆటోను తన ఇంటి ముందు పార్క్ చేశాడు. సోమవారం ఉదయం బయటికి వచ్చి చూడగా ఆటో కనిపించలేదు. సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజీపి పరిశీంచగా అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి ఆటోను చోరీ చేసి తీసుకువెళ్తున్నట్లు గుర్తించాడు. ఈ విషయాన్ని ఝార్ఖండ్‌కు చెందిన తమవారందరితో కలిసి ఉన్న ‘ఝార్ఖండ్ ఏక్ తా సమాజ్’ వాట్సాప్ గ్రూపులో చోరీకి గురైన ఆటోతో పాటు సీసీ ఫుటేజీని కూడా పోస్ట్ చేశాడు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో దీపక్‌కుమార్ అనే ఝార్ఖండ్ వాసి మరిన్ని గ్రూపుల్లో దీనిని పోస్ట్ చేశాడు. బొల్లారంలో ఉంటున్న ఝార్ఖండ్‌కు చెందిన కల్లుకుమార్ అనే ఆటోడ్రైవర్ ప్రయాణికులను ఎక్కించుకుని బంజారాహిల్స్ రోడ్డునెంబర్–10లో స్టార్ ఆస్పత్రికి వచ్చాడు. అదే రోడ్డులో బిపిన్ పోగొట్టుకున్న ఆటో పక్కన పార్కింగ్ చేసి కనిపించడంతో పాటు ఓ వ్యక్తి ఆటోకు అంటించిన స్టిక్కర్లను తొలగిస్తూ కనిపించాడు. దీనిని గుర్తించిన కల్లుకుమార్ వీడియో తీసి మళ్లీ వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశాడు. చోరీకి గురైన తన ఆటో ఇదేనంటూ, వెంటనే అక్కడికి వెళ్లాలంటూ వాట్సప్‌లో రిక్వెస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన బంజారాహిల్స్‌లో నివసిస్తున్న ఝార్ఖండ్ వాసులు రోడ్డునెంబర్–10లోని ఆటో వద్దకు చేరుకున్నారు. ఆటోపై స్టిక్కర్లు తొలగిస్తున్న వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని ఆటోతో పాటు దొంగను అదుపులోకి తీసుకున్నారు.
ఆల్వాల్ పోలీసులకు నిందితుడి అప్పగింత..
నిందితుడిని పట్టుకున్న ఝార్ఖండ్ వాసు బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించగా వారు అతడిని ఆల్వాల్ పోలీసులకు అప్పగించారు. విచారణలో దొంగతనం చేసిన యువకుడు జీడిమెట్ల పరిధిలోని రొడామిస్ట్రీకాాలనీకి చెందిన రోహిత్‌గా గుర్తించారు. సదరు ఆటోను అతను తన స్నేహితుడు రఘురామ్‌కు ఇవ్వగా రఘురామ్ తన బంధువులకు ఎక్కించుకుని బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి వచ్చి ఝార్ఖండ్‌వాసులకు చిక్కాడు. ఇలా ఒక వాట్సాప్ గ్రూప్ గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టించగా, పోలీసులు సైతం ఊపిరిపీల్చుకున్నారు. ఝార్ఖండ్ వాసుల వాట్సాప్ గ్రూప్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.
దొంగను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగింత..
బంజారాహిల్స్‌లో ఘటన..