
నేత్రదానం మహాదానం: సజ్జనార్
గోల్కొండ: నేత్రదానంపట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని టీజీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ వైస్ చైర్మన్ వి.సి.సజ్జనార్ అన్నారు. 40వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు సోమవారం మెహిదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన జ్యోతిప్రజ్వలన చేసి మాట్లాడారు. సుధీర్ఘకాలంగా నేత్రదానంపై సరోజినీదేవి ఆసుపత్రి వారు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. నేత్రదానం వల్ల మరొకరికి కంటి చూపు ప్రసాదించవచ్చన్నారు. తమ వంతు కృషిగా బస్టాండ్‌లు, బస్‌డిపోల వద్ద నేత్రదాన ఆవశ్యకతపై పోస్టర్‌లు అతికించామని తెలిపారు. కార్యక్రమంలో ఉస్మానియా వైద్యకళాశాల సూపరిండెంటెంట్ డాక్టర్ రాజారావు, సిద్దిపేట మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంగీత, ఎంపీసీడీ సభ్యురాలు డాక్టర్ కళావతి, సరోజినీదేవి కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మోదిని తదితరులు పాల్గొన్నారు.