
రైలుకిందపడి ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
సికింద్రాబాద్: రైలు కింద పడి బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం రాత్రి సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబుల్ డేవిడ్‌రాజు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఘట్‌కేసర్–బీబీనగర్ రైల్వేస్టేషన్ల మధ్య ఓ యువతి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు సిర్‌పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైలు లోకోపైలట్ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహం వద్ద లభించిన గుర్తింపుకార్డు ఆధారంగా మృతురాలిని ఘట్‌కేసర్ విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏఐ అండ్ డీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని దుంపటి హితవర్షిణి(20)గా గుర్తించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన అంజన్న కుమార్తె హిత వర్షిణి ఘట్‌కేసర్‌లోని కాలేజీ హాస్టల్‌లో ఉంటూ ఇంజినీరింగ్ చదువుతోంది. సెలవుల కారణంగా మూడు రోజుల క్రితం ఆర్మూర్‌కు వెళ్లిన ఆమె ఆదివారం మధ్యాహ్నం నిజామాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులో సికింద్రాబాద్ జూబ్లీ బస్‌స్టేషన్‌కు చేరుకుంది. అక్కడి నుంచి మెట్రో రైలు ఎక్కి ఉప్పల్ స్టేషన్‌లో దిగింది. ఉప్పల్ నుంచి ఆటోలో ఘట్‌కేసర్ చేరుకున్న హితవర్షిణి సమీపంలోని ట్రాక్ వద్దకు వెళ్లి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు పట్టారు.
ప్రేమ వ్యవహారమే కారణమా..?
లక్సెట్టి పేటలో యువకుడి ఆత్మహత్య
కాగా హిత వర్షిణి (20) వినయ్ అనే యువకుడిని ప్రేమిస్తున్నట్లు సమాచారం. హితవర్షిణి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియగానే వినయ్ సోమవారం మధ్యాహ్నం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు తెలిపారు.