
అఫ్జల్‌గంజ్‌లో అగ్నికీలలు
మూడంతస్తుల నివాస భవనంలో చెలరేగిన మంటలు
● పసిపాప సహా ఏడుగురిని కాపాడిన ఫైర్ సిబ్బంది
● షార్ట్ సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగిందన్న పోలీసులు
అఫ్జల్‌గంజ్: అఫ్జల్‌గంజ్‌లోని మహారాజ్‌గంజ్‌లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మూడంతస్తుల నివాస భవనంలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది భవనంలోని ఏడాది చిన్నారి సహా మరో ఏడుగురిని నిచ్చెన ద్వారా కిటికీల నుంచి బయటికి తీసుకువచ్చి రక్షించారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోనే ప్రముఖ వ్యాపార కేంద్రమైన మహారాజ్‌గంజ్‌లోని మూడంతస్తుల భవనంలో రెండు కుటుంబాలు నివసిస్తున్నాయి. భవనంలో గురువారం ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అందులో అప్పటికే ఉంటున్న రెండు కుటుంబాలకు చెందిన కిశోర్ లాల్‌వాని, రాజు లాల్‌వాని, లక్ష్మీ లాల్‌వాని, జ్యోతిరామ్, ప్రియ, యాష్, సమర్థ్‌లతో పాటు ఏడాది వయసున్న చిన్నారిని ఫైర్ సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తరలించారు. మొదటి అంతస్తు నుంచి రెండు మూడు అంతస్తులకు వేగంగా మంటలు వ్యాపించడంతో మొదట నాలుగు ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు సాయంత్రం వరకూ శ్రమించారు. దాదాపు 20 ఫైర్ ఇంజిన్లు వాడినట్లు అంచనా. కాగా.. ఈ భవనంలో ప్లాస్టిక్ గోదాంను నిర్వహిస్తుండడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందినట్లు పలువురు చెబుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు ఫైర్ అధికారులు గుర్తించారు. ఆస్తినష్టం ఎంత వాటిల్లిందనే విషయం తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. కాగా.. ప్రమాద ఘటనపై ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, కార్పొరేటర్ శంకర్ యాదవ్ తదితరులు పరిశీలించారు.

అఫ్జల్‌గంజ్‌లో అగ్నికీలలు

అఫ్జల్‌గంజ్‌లో అగ్నికీలలు