
ముగ్గురు కుమార్తెలతో సహా చెరువులో దూకిన తల్లి
మేడిపల్లి: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ తన ముగ్గు కుమార్తెలతో సహా చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో పరిధిలో చోటు చేసుకుంది. మృతురాలి బంధువులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కన్మనూరు గ్రామానికి చెందిన నాగరాజు, సుజాత (32) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చిన వీరు నారపల్లి, మహాలక్ష్మిపురం కాలనీలో నివాసం ఉంటున్నారు.సుజాత చెరుకు రసం బండి నడుపుతుండగా, నాగరాజు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు అక్షిత(13), ఉదయశ్రీ(11) వర్షిణి(6) ఉన్నారు. కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో బుధవారం పెద్ద మనుషులు పంచాయితీ చేసి ఇద్దరికి సర్దిచెప్పారు. అయితే అదేరోజు రాత్రి మళ్లీ గొడవ జరగడంతో మనస్తాపానికి లోనైన సుజాత గురువారం ముగ్గురు పిల్లలతో సహా నారపల్లి చెరువులోకి దూకి అత్మహత్యకు పాల్పడింది. దీనిని గుర్తించిన స్థానికులు చెరువులోకి దూకి వారిని బయటికి తీశారు. అయితే అప్పటికే సుజాత, చిన్న కుమార్తె వర్షిణి మృతి చెందారు. అపస్మారకస్థితిలో ఉన్న అక్షిత, ఉదయశ్రీని గాంధీ ఆసుపత్రికి తరలించారు.వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అసుపత్రికి తరలించారు. సుజాత బంధువుల ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
● తల్లి, చిన్న కుమార్తె మృతి
● ఇద్దరు పిల్లలను కాపాడిన స్థానికులు