
ఆ నగరాల దుస్థితి మనకు రావద్దు
ఇతర మెట్రోల పరిస్థితుల నుంచి పాఠం నేర్చుకోవాలి
హైడ్రా మరింత బలోపేతం
ముఖ్యమంత్రి ఆలోచన, ప్రభుత్వ ఆకాంక్షకు అనుగుణంగా హైడ్రా ఏర్పాటైంది. గడిచిన పది నెలల్లో ప్రజలకు చేరువై వారి మన్ననలు పొందింది. దీని ఏర్పాటు దేశంలోనే ఓ చారిత్రక నిర్ణయం అని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) సైతం తన వ్యాసంలో కితాబిచ్చింది. ప్రజా సంక్షేమం కోసమే హైడ్రా పని చేస్తోంది. ఇప్పుడు పోలీసుస్టేషన్ కూడా రావడంతో మరింత బలోపేతం అవుతోంది. చెరువులకు సంబంధించిన ఎఫ్‌టీఎల్ నిర్ధారణకు సంబంధించిన కీలక ఫొటోలు మరో నెలన్నరలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుంచి అందుతాయి. నాలాల పునరుద్ధరణకు డేటా సేకరిస్తున్నాం.
– ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్
సాక్షి, సిటీబ్యూరో:
‘బెంగళూరులో తాగునీరు, ముంబై, చైన్నెలలో వరద సమస్యల కారణంగా అనేక సంస్థలు అక్కడ నుంచి తరలి వెళ్లిపోతున్నాయి. ఢిల్లీలో కాలుష్యం కారణంగా పార్లమెంట్ నుంచి పాఠశాలల వరకు మూతపడే పరిస్థితి ఉంటుంది. మానవ తప్పిదం వల్ల అవి నివాసయోగ్యం కాని నగరాలుగా మారుతున్నాయి. వాటి నుంచి మనం గుణపాఠం నేర్చుకుని, పాఠంగా స్వీకరించాలి. లేదంటే హైదరాబాద్ కూడా వాటి సరసన చేరుతుంది. అందుకే ఎవరు ఏమి అనుకున్నా, ఎలాంటి విమర్శలు చేసినా నియంత్రించాలని, నిలువరించాలని అవసరమైతే ఆక్రమణదారుల్ని నిర్మూలించాలని నిర్ణయించుకుని హైడ్రాను ఏర్పాటు చేశాం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం బుద్ధభవన్ వద్ద హైడ్రా పోలీసుస్టేషన్‌కు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ విభాగం అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రత్యేక వాహనాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, హోం సెక్రటరీ రవి గుప్తా తదితరులు హాజరయ్యారు.
ప్రకృతి విధ్వంసం జరిగినా ఫర్వాలేదా..?
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘హైడ్రా అంటే పేదల ఇళ్లు కూలగొట్టడానికి పెట్టినట్లు కొందరు చిత్రీకరిస్తున్నారు. వాళ్ల ఆలోచనలు, విధానాలతో నాకు ఆశ్చర్యం కలుగుతోంది. హైదరాబాద్‌లో ప్రకృతి విధ్వంసం జరిగినా.. నగరం కుప్పకూలినా ఫర్వాలేదు, నగరం కాలుష్య నగరంగా మారి ప్రజలు పారిపోయినా ఫర్వాలేదనే కుట్ర, కసి, కడుపుమంట వారి మాటల్లో కనిపిస్తోంది. మూసీ, ఈసీ నీటిని ఒడిసిపట్టడానికి వీటిని నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటి హైటెక్ సిటీ వరకు వివిధ సందర్భాల్లో నగరాన్ని పునరుద్ధరించుకుంటూ, అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్లాం. అయితే చరిత్రలో చాలాసార్లు ప్రజలు నగరానికి వలస వచ్చినప్పుడల్లా సంప్రదాయ ప్రాంతాలను వదిలేసి కొత్త ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం. పాత నగరాన్ని వదిలేసి కొత్తకొత్తవి అభివృద్ధి చేసుకుంటూ వెళ్లున్నాం. ఇలా కొన్నాళ్లు గడిస్తే వారసత్వంగా మనకు అందినవి కాలగర్భంలో కలిసిపోతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇది ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ అనే ఉద్దేశంతో పునరుద్ధరణ చేయాలని ఆలోచన చేశాం’ అని వ్యాఖ్యానించారు.
సీఎంగా చెప్పినా ఆశించిన ఫలితాలు రాలేదు...
‘పోలీసు విభాగంలో ఏసీబీ, సీఐడీ, ఆక్టోపస్.. ఇవన్నీ ఒకేసారి అమలులోకి రాలేదు. అవసరాలు, పరిస్థితులకు తగ్గట్టు కొత్త శాఖలను ఏర్పాటు చేసుకున్నాం. ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, పోలీసు ఇలా అనేక శాఖల మధ్య సమన్వయ లోపంతో సమస్య వచ్చినప్పుడు ఎవరి పరిష్కరించాలనే అంశంలో ఇబ్బందులు వస్తున్నాయి. శాఖల మధ్య సమన్వయం కోసం ముఖ్యమంత్రిగా నేను చెప్పినా ఆశించిన మేరకు ఫలితాలు రాలేదు. దీనిపై అనుభవజ్ఞులతో మాట్లాడి కీలక నిర్ణయాలు తీసుకున్నా’ అని వివరించారు. ‘1908లో వచ్చిన వరదల్ని చూసి భోరున విలపించిన నిజాం గొప్ప ఆలోచనతో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ద్వారా వరదల నిరోధానికి ప్రణాళికలు చేశారు. అప్పట్లో వారు మొదలుపెట్టిన, విశ్వేశ్వరయ్య అందించిన గొప్ప కట్టడాలే మూసీ, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్’లు అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఎవరెన్ని విమర్శలు చేసినా ముందుకే వెళతాం
హైడ్రా ఠాణా ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి

ఆ నగరాల దుస్థితి మనకు రావద్దు