
హైదరాబాద్ టు హనోయ్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నుంచి హనోయ్‌లోని నోయ్‌బాయ్ విమానాశ్రయానికి కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు వియట్‌జైట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉండగా కొత్తగా వియత్నాం ఎయిర్‌లైన్స్ సర్వీసులు మొదలయ్యాయి. నగరం నుంచి వియత్నాం వెళ్లే పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో విమాన సర్వీసులకు సైతం భారీ డిమాండ్ నెలకొంది. కొత్తగా ప్రారంభించిన వియత్నాం ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ (వీఎన్–984) హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతి ఆది, బుధ, శుక్ర వారాల్లో రాత్రి 11.45 గంటలకు బయలుదేరుతుంది. హనోయ్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5.25 గంటలకు అక్కడికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో వియత్నాం ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ (వీఎన్–985) హనోయ్ నుంచి ప్రతి ఆది, బుధ, శుక్ర వారాల్లో సాయంత్రం 7.15 గంటలకు బయలుదేరి రాత్రి 10.15 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
మారుతోంది డెస్టినేషన్..
● సాధారణంగా హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది పర్యాటకులు దుబాయ్, సింగపూర్, థాయ్‌లాండ్, మలేసియా తదితర దేశాలకు రాకపోకలు సాగిస్తారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతి రోజు సుమారు 12 వేల మందికిపైగా విదేశాలకు వెళ్లే ప్రయాణికులు ఉంటే వారిలో 60 శాతానికి పైగా ఈ నాలుగైదు దేశాలకు రాకపోకలు సాగించే వాళ్లే ఎక్కువ. కాగా.. కొంతకాలంగా సిటీ టూరిస్టుల డెస్టినేషన్‌లు మారుతున్నాయి. కొత్త ప్రదేశాల్లో పర్యటించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. సోలోగా వెళ్లే వారికి, కుటుంబాలతో సహా కలిసి వెళ్లాలనుకొనే వాళ్లను వియత్నాం విశేషంగా ఆకట్టుకుంటోంది. గత సంవత్సరం భారత్ నుంచి సుమారు 5 లక్షల మంది వియత్నాం సందర్శించినట్లు అంచనా. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేకించి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వియత్నాంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించినవాళ్లు లక్ష మందికిపైగా ఉంటారని అమీర్‌పేట్‌కు చెందిన ఒక ప్రముఖ ట్రావెల్స్ సంస్థ వెల్లడించింది.
● వియత్నాంకు పర్యాటక ప్యాకేజీలను అందజేస్తున్న సంస్థలకు సైతం డిమాండ్ పెరిగింది, సులభంగా వీసాలు లభించడం, విమాన చార్జీలు, పర్యాటక ఖర్చులు కూడా తక్కువ మొత్తంలోనే ఉండడం వల్ల ఎక్కువ మంది వియత్నాంను సందర్శిస్తున్నారు. ‘ఆ దేశంలో వందల కొద్దీ పర్యాటక స్థలాలు ఉన్నాయి. చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. ఆ దేశంలోని ఒక్క డానాంగ్ ప్రాంతాన్నే సుమారు 2.22 లక్షల మంది భారతీయ పర్యాటకులు గత సంవత్సరం సందర్శించారు.’అని వాల్మీకి ట్రావెల్స్ సంస్థ వ్యవస్థాపకులు హరికిషన్ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి కనెక్టివిటీ పెరగడంతో ఎక్కువ మంది సందర్శించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
సిటీ టూరిస్ట్ నయా డెస్టినేషన్
వియత్నాం ఎయిర్‌లైన్స్ సర్వీసులు ప్రారంభం
తెలుగు రాష్ట్రాల నుంచి వియత్నాంకు పెరిగిన టూర్లు
ఒక అందమైన దేశం..
సహజమైన దీవులు, ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు, ఆహ్లాదకరమైన వాతావరణం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆ దేశంలోని హనోయ్, హోచిమిన్ సిటీ, హాలోంగ్ బే, హోయి ఆన్, సాపా, హ్యూ,పాంగ్‌న, బిన్‌తన్, మయిచావ్, కావోబాంగ్ వంటి సుమారు 45 ప్రముఖ పర్యాటక స్థలాలను ఎక్కువ మంది సందర్శిస్తున్నారు.