ఎండలు అలా.. కరెంటు ఇలా..! | - | Sakshi
Sakshi News home page

ఎండలు అలా.. కరెంటు ఇలా..!

Mar 4 2025 6:40 AM | Updated on Mar 4 2025 6:38 AM

గ్రేటర్‌లో పెరిగిన ఎండలు విద్యుత్‌ డిమాండ్‌ ౖపైపెకి..

సోమవారం మధ్యాహ్నం ఎండతో నిర్మానుష్యంగా మారిన బషీర్‌బాగ్‌ చౌరస్తా

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎండలు భగ్గున మండుతున్నాయి. సోమవారం హైదరాబాద్‌ జిల్లా షేక్‌పేటలో గరిష్టంగా 36.2 సెల్సియస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఇండస్ట్రియల్‌ ఏరియాలో అత్యధికంగా 38.2 సెల్సియస్‌ డిగ్రీలు నమోదైంది. అదేవిధంగా మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లో 38 డిగ్రీలు నమోదు కాగా, వికారాబాద్‌ జిల్లా మొమిన్‌పేటలో 38.1 సెల్సియస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణంగా మధ్యాహ్నం 12 తర్వాత రికార్డయ్యే ఎండలు..ప్రస్తుతం ఉదయం 10 గంటలకే నమోదవుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలకు ఉక్కపోత తోడవడంతో ఇంట్లోని ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్ల వినియోగం భారీగా పెరిగింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం గృహ విద్యుత్‌ వినియోగం 25 శాతం అధికంగా నమోదవుతున్నట్లు డిస్కం ఇప్పటికే స్పష్టం చే సింది. సోమవారం అత్యధికంగా 70 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ డిమాండ్‌ నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. నేటి నుంచి మరో నాలుగు రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో విద్యుత్‌ డిమాండ్‌ కూడా అదేస్థాయిలో నమోదయ్యే అవకాశం లేకపోలేదు. మార్చి చివరి నాటికి వంద ఎంయూలకు దాటే అవకాశం ఉన్నట్లు డిస్కం ఇంజనీర్లు అంచనా వేశారు. ఆ మేరకు ముందస్తు ఏర్పాట్లు కూడా చేశారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్త

డాక్టర్‌ వెంకటి, డీఎంహెచ్‌ఓ, హైదరాబాద్‌

ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకటి తెలిపారు. ‘సాధారణంగా మనిషి శరీరం 37 డిగ్రీల ఉష్ణోగ్రతలను మాత్రమే తట్టుకుంటుంది. ఆపై నమోదయ్యే ఉష్ణోగ్రతలను తట్టుకోలేదు. ఎండకు చర్మం నల్లగా కమిలిపోవడంతో పాటు డిహైడ్రేషన్‌కు లోనవుతుంటారు. మూత్రంలో మంట, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతుంటాయి. కాబట్టి ఎండల నుంచి కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో వండిన ఆహారమే తీసుకోవాలి. నీళ్లు బాగా తాగాలి’ అని ఆయన పేర్కొన్నారు.

గత వారం గ్రేటర్‌లో విద్యుత్‌ డిమాండ్‌ ఇలా...

తేదీ సమయం మెగావాట్లు

ఫిబ్రవరి 26 09.23 3306

27 18.55 3272

28 18.56 3398

మార్చి 01 19.02 3254

02 19.14 3017

03 18.00 3369

షేక్‌పేటలో గరిష్టంగా 36.2 డిగ్రీలు..

మహేశ్వరంలో 38.2 డిగ్రీలు నమోదు

రికార్డు స్థాయిలో (70 ఎంయూలు) విద్యుత్‌ డిమాండ్‌

ఇష్టానుసారం ఎల్సీలు తీసుకుంటే..ఇక వేటే

ఇష్టానుసారం ఎల్సీలు ఇక కుదరదు

ముషారఫ్‌ ఫారూఖీ, సీఎండీ, ఎస్పీడీసీఎల్‌

గతంతో పోలిస్తే గృహ విద్యుత్‌ వినియోగం ప్రస్తుతం రెట్టింపైంది. ప్రతి ఇంట్లోనూ ఏసీ, కూలర్‌, రిఫ్రిజిరేటర్‌లు సర్వసాధారణమయ్యాయి. ఉదయం, మధ్యాహ్నంతో పోలిస్తే..సాయంత్రం వేళ విద్యుత్‌ డిమాండ్‌ అనుహ్యంగా పెరుగుతోంది. ఇలాంటి సమయంలో అనివార్యమైతే తప్ప...ఎల్సీ(లోడ్‌ రిలీఫ్‌)లు తీసుకోవద్దని సీఎండీ ముషారఫ్‌ ఫారూఖీ ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుంచి 25 వరకు ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెప్పపాటు కూడా కరెంట్‌ పోకుండా చూడాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఇంజనీర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఎండలు అలా.. కరెంటు ఇలా..! 1
1/2

ఎండలు అలా.. కరెంటు ఇలా..!

ఎండలు అలా.. కరెంటు ఇలా..! 2
2/2

ఎండలు అలా.. కరెంటు ఇలా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement